Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌లో భారీ పెట్టుబడులు, 3.17 కోట్ల కొత్త ఫోలియోలు!

Mutual Funds Add 3 Crore Folios - Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతున్న కొద్దీ, వారి నుంచి వచ్చే పెట్టుబడులు కూడా ఇతోధికం అవుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22)లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు సంబంధించి 3.17 కోట్ల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి.

 ఒక ఇన్వెస్టర్‌ ఒక పథకంలో చేసే పెట్టుబడి ఖాతాయే ఫోలియో. 2020–21 సంవత్సరంలో 81 లక్షల కొత్త ఖాతాలే తెరుచుకున్నాయి. దాంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతిరాతి గుప్తా పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం రేటు, ప్రజల్లో పెట్టుబడుల పట్ల అవగాహన ఇవన్నీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమపై ప్రభావం చూపిస్తాయని ఆమె చెప్పారు. 

వడ్డీ రేట్లలో మార్పుల వల్ల మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొంటే ఇన్వెస్టర్లు ఆందోళనకు లోను కావచ్చని, అప్పుడు ఫోలియోలు తగ్గొచ్చని నియో (నియోబ్యాంకింగ్‌ కంపెనీ) స్ట్రాటజీ హెడ్‌ స్వప్నిల్‌ భాస్కర్‌ అభిప్రాయపడ్డారు. యాంఫి డేటా ప్రకారం.. 43 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల పరిధిలో ఫోలియోల సంఖ్య 2022 మార్చి నాటికి 12.95 కోట్లకు పెరిగింది. 2021 మార్చి నాటికి ఈ సంఖ్య 9.78 కోట్లుగా ఉంది. అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.37.7 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 

చదవండి: మ్యూచువల్ ఫండ్స్ మురిపిస్తున్నాయ్..పెట్టుబడులు పెరుగుతున్నాయ్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top