
టైర్ 2, ఇతర పట్టణాల్లో చిన్నతరహా వ్యాపారాలు నిర్వహించే మహిళలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఆర్థిక ఉత్పత్తులను కోరుకుంటున్నట్టు ‘భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) 2025’ నివేదిక వెల్లడించింది. బిజినెస్ మేనేజన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘టైడ్’ దీన్ని విడుదల చేసింది.
అంతేకాదు ఆయా పట్టణాల్లో చిన్నతరహా మహిళా పారిశ్రామికవేత్తల్లో మూడింట ఒక వంతు మంది రుణం పొందే విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తనఖా నిబంధనలు కఠినంగా ఉండడం, ఆర్థిక అక్షరాస్యత తగినంత లేకపోవడం వీరిని రుణ సదుపాయానికి దూరం చేస్తోందని, వీరికి తనఖా రహిత సూక్ష్మ రుణాలు సహా తదితర ప్రత్యామ్నాయ రుణ సదుపాయాలు అందించేందుకు సత్వర విధానపరమైన చర్యలు అవసరమని ఈ నివేదిక సూచించింది.
‘‘టైర్ 2, 3, అంతకంటే చిన్న పట్టణాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు డిజిటల్ అవగాహనతో వృద్ధి చెందాలన్న ఆకాంక్షలతో ఉన్నారు. కానీ, రుణ సదుపాయం, నెట్‌వర్క్‌లు, తదితర సంస్థాగత అంతరాలు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి’’అని తెలిపింది.
మహిళల అభిప్రాయాలు..
1,300 మంది మహిళా వ్యాపారవేత్తల అభిప్రాయాలను బీడబ్ల్యూఏఐ సర్వే చేసింది. ఆరి్థక, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందని 58% మంది చెప్పడం గమనార్హం.డిజిటల్ నైపుణ్యాలను పెంచుకోవాలన్న బలమైన ఆకాంక్ష 12 శాతం మందిలో కనిపించింది.
28 శాతం మంది నిధుల విషయంలో తమ కుటుంబం నుంచి పురుష సభ్యుడి సహకారం అవసరమని చెప్పారు. వ్యవస్థాపకులుగా వారి ప్రయాణంలో ఇదొక పెద్ద అడ్డంకిగా నివేదిక పేర్కొంది.
డిజిటల్ నైపుణ్యాల పెంపు, వారికి లభిస్తున్న వివిధ పథకాల సమాచారం అందించడం, నెట్‌వర్కింగ్ పెంపు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాలను సులభతరం చేయొచ్చని ఈ నివేదిక సూచించింది.