మోంథా తుఫాన్ విజృంభించింది. ఈ రోజు (మంగళవారం) తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు విమానాలు, రైళ్లను నిషేధించారు. ఈ తుఫాన్ వ్యవసాయం, రవాణా వంటివాటిమీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ కూడా పరోక్ష ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది.
నిజానికి స్టాక్ మార్కెట్లలో మార్పులు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. టారిఫ్స్ ప్రభావం, కొన్ని దేశాల కీలకనేతలు లేదా దిగ్గజ కంపెనీలు తీసుకునే నిర్ణయాలు స్టాక్ మార్కెట్ మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సందర్భాలను గతంలో మనం చాలానే చూశాము. కానీ మోంథా తుఫాన్ స్టాక్ మార్కెట్ మీద ఈ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదు.
మోంథా తుఫాన్ ఎఫెక్ట్.. ప్రధానంగా వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయం, కన్స్యూమర్ డిమాండ్ వంటి అంశాల ద్వారా మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. పోర్ట్స్ & లాజిస్టిక్స్, ఎనర్జీ (పవర్) సంబంధించిన రంగాలపై కూడా ఈ ప్రభావం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఉదయం 9:20 గంటలకు స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. 10:20 గంటలకు సెన్సెక్స్ 256.75 పాయింట్లు నష్టపోయి 84,522.09 పాయింట్లు వద్ద, 62.50 పాయింట్ల నష్టంతో 25,903.55 వద్ద సాగుతోంది. ఈ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు ఈ రోజు (అక్టోబర్ 28) ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. నికాయ్ 225 (జపాన్), హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ (హాంకాంగ్), కోస్పీ (సౌత్ కొరియా), జకార్తా కంపోసైట్ (ఇండోనేషియా), షాంఘై కంపోసైట్ (చైనా) వంటివి స్వల్ప నష్టాలను చవిచూడగా.. స్ట్రైన్ టైమ్స్, తైవాన్ వైటెడ్ లాభాల్లో ముందుకు సాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్ మీద కూడా ప్రభావము చూపుతుంది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమ సంకేతాలను సూచిస్తున్నాయి.
ఇన్వెస్టర్లకు సూచనలు
మోంథా తుఫాన్ స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ.. ఇన్వెస్టర్లు తప్పకుండా కొంత జాగ్రత్త వహించాలి. ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనే విషయాన్ని పరిశీలించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ & లాజిస్టిక్స్, అగ్రికల్చర్, రియల్టీ, టూరిజం & హాస్పిటాలిటీ వంటి రంగాలకు కొన్ని రోజులు దూరంగా ఉండటం మంచిది. అయితే సిమెంట్, పెయింట్స్, బేవరేజెస్ రంగాల్లో తాత్కాలిక ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నందున లాంగ్ టర్మ్ వ్యూహంతో ముందుకు వెళ్లాలి. వర్షపాతం గణాంకాలు, పంటల స్థితి వంటి అంశాలను నిరంతరం పరిశీలిస్తూ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేయాలి.
తుఫాన్స్ ఎఫెక్ట్: గతంలో స్టాక్ మార్కెట్‌పై ఇలా
2014లో వచ్చిన హుద్‌హుద్ (విశాఖపట్నం) తుఫాన్ కారణంగా.. పోర్ట్‌లు & ఇండస్ట్రీస్ 3-5 రోజులు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ తాత్కాలికంగా పడిపోయింది. 2019లో ఒడిశాలో వచ్చిన ఫణి తుఫాన్ దెబ్బకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒత్తిడికి లోనయ్యాయి. 2021లో వచ్చిన తౌక్టే తుఫాన్ ఎనర్జీ, షిప్పింగ్ రంగాలు తాత్కాలిక ప్రభావం చూసాయి. దీన్నిబట్టి చూస్తే.. తుఫాన్ లేదా ప్రకృతి వైపరీత్యాలు స్టాక్ మార్కెట్ మీద తాత్కాలిక ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి చెప్పుకోదగ్గ స్థాయిలో స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసే అవకాశం లేదు.


