రిలయన్స్, మెటా.. మెగా ప్రాజెక్టు | Meta And Reliance Industries Join Hands To Build Massive AI Data Center In Jamnagar, Check Out Project Key Details | Sakshi
Sakshi News home page

రిలయన్స్, మెటా.. మెగా ప్రాజెక్టు

Jun 10 2026 12:22 PM | Updated on Jun 10 2026 1:58 PM

Meta Reliance to Build India First AI Powered Mega Data Center Jamnagar

ప్రపంచ సాంకేతిక దిగ్గజం మెటా, దేశీయ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్తంగా భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. గ్లోబల్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా భారత్‌ను నిలబెట్టే క్రమంలో మెటా సంస్థ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్మిస్తున్న మొట్టమొదటి ‘బిల్ట్-టు-సూట్’(కస్టమైజ్డ్) డేటా సెంటర్ ఇదే కావడం విశేషం.

ప్రాజెక్టు ముఖ్యాంశాలు

  • ప్రాథమికంగా 168 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మాణం కానుంది. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించే అవకాశం ఉంది.

  • రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • డేటా సెంటర్ డిజైన్, నిర్మాణం, యుటిలిటీల నిర్వహణ, నెట్‌వర్క్ కనెక్టివిటీ, మేనేజ్డ్ సర్వీసెస్ వంటి అన్ని బాధ్యతలను రిలయన్స్ గ్రూప్ నిర్వహించనుంది.

  • ఈ డేటా సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో పనిచేస్తుంది. అంతేకాకుండా, ప్లాంట్ శీతలీకరణ (కూలింగ్‌) కోసం లవణరహితం(ఉప్పు తొలగించిన) చేసిన సముద్రపు నీటిని ఉపయోగించనున్నారు.

జామ్‌నగర్ ఎంపికకు గల కారణాలు

వ్యూహాత్మకంగా జామ్‌నగర్ ఈ ప్రాజెక్టుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా నిలిచింది. పారిశ్రామికంగా అనుకూలమైన వాతావరణం, మెరుగైన పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి లభ్యతతో పాటు సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు ఇది సమీపంలో ఉంది. దీనికి తోడు జియోకు చెందిన విస్తృతమైన ఫైబర్ నెట్‌వర్క్ ఈ డేటా సెంటర్‌కు అదనపు బలాన్ని చేకూర్చనుంది.

‘మెటాతో కుదిరిన ఈ భాగస్వామ్యం భారత డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మెటాతో కలిసి ఇలాంటి అధునాతన డేటా సెంటర్‌ను నిర్మించడం, ప్రపంచ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. జామ్‌నగర్ ఇకపై గ్లోబల్ హైపర్‌స్కేల్ ఏఐ కంప్యూటింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారుతుంది’ అని ముకేష్ అంబానీ అన్నారు.

‘భారతదేశంలో మా మొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్మించడానికి రిలయన్స్‌తో చేతులు కలపడం మాకు గర్వకారణం. జామ్‌నగర్‌లోని ఈ ప్రపంచ స్థాయి ఫెసిలిటీ ద్వారా మా ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి సహాయపడుతుంది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థలో మా దీర్ఘకాలిక పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుంది’ అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

ఇదీ చదవండి: హ్యాట్రిక్‌ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!

Advertisement
 
Advertisement
Advertisement