
ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్న మారుతి సుజుకి అమ్మకాల్లో కూడా అరుదైన మైలురాళ్లను చేరుకుంటోంది. దీన్నిబట్టి చూస్తుంటే ఉత్పత్తి కూడా వేగంగా జరుగుతోందని తెలుస్తోంది.
2023లో మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. ఇటీవల 5,00,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. ఈ కారు ప్రతి నెలా 12,000 నుంచి 15,000 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. 2023 మార్చిలో ఫ్రాంక్స్ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి 2023 డిసెంబర్ నాటికి.. కేవలం 9 నెలల్లో కంపెనీ లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసింది.

2024 జూన్ నాటికి రెండు లక్షల యూనిట్లు, నవంబర్ 2024 నాటికి 3 లక్షల యూనిట్లు, ఫిబ్రవరి 2025 నాటికి 4 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరిగింది. కాగా జులైలో దీని ఉత్పత్తి 5 లక్షల యూనిట్లకు చేరుకుంది. అమ్మకాల్లో కూడా దూసుకెళ్తున్న ఈ SUV మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. అవి సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా & ఆల్ఫా వేరియంట్స్. వీటి ధరలు రూ. 7.59 లక్షల నుంచి రూ. 13.07 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత్‌లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?
మారుతి ఫ్రాంక్స్ 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇవి రెండూ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ పొందుతాయి. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా మంచి విక్రయాలను పొందుతోంది. ఈ కారణంగానే ఎగుమతుల్లో కూడా దూసుకెళ్తోంది.