సెబీ గ్రీన్ సిగ్నల్...
జాబితాలో మీషో, షిప్‌రాకెట్
రూ.7,700 కోట్ల సమీకరణ ప్రణాళిక
పబ్లిక్ ఇష్యూల తాకిడితో దలాల్ స్ట్రీట్ దుమ్మురేగుతోంది. తాజాగా మరో ఏడు కంపెనీల ఐపీఓలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లిస్టింగ్ బాట పట్టనున్నాయి. వీటిలో ముఖ్యంగా సాఫ్ట్‌బ్యాంక్ భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ–కామర్స్ కంపెనీ మీషో, టెమాసెక్ దన్నుతో దూసుకెళ్తున్న షిప్ రాకెట్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఏడు కంపెనీలు కలిపి దాదాపు రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. పబ్లిక్ ఆఫర్‌కు సెబీ ఓకే చెప్పిన ఇతర కంపెనీల్లో జర్మన్ గ్రీన్ స్టీల్ అండ్ పవర్, అలైడ్ ఇంజనీరింగ్ వర్క్స్, స్కైవేస్ ఎయిర్ సరీ్వసెస్, రాజ్‌పుటానా స్టెయిన్‌లెస్, మానిక ప్లాస్టెక్ ఉన్నాయి. ఈ ఏడాది మే–జూలై మధ్య ఐపీఓల కోసం ఈ కంపెనీలన్నీ దరఖాస్తు చేసుకోగా, సెబీ తాజాగా ఆమోముద్ర వేసింది.
2025 కొత్త రికార్డ్...
ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 2025లో ఇప్పటికే మొత్తం 86 కంపెనీలు ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో అరంగేట్రం చేశాయి. ఇవి దాదాపు రూ.1.4 లక్షల కోట్లను సమీకరించాయి. 2024లో 90 కంపెనీలు రూ.1.67 లక్షల కోట్లను సమీకరించగా.. ఈ ఏడాది ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. కాగా, బ్రోకరేజీ సంచలనం గ్రో (రూ.6,632 కోట్లు)తో పాటు పైన్ ల్యాబ్స్ (రూ.3,840 కోట్లు) తదితర బడా ఇష్యూలు ఈ ’వారంలోనే క్యూ కడుతున్నాయి.
మీషో రూ.4,250 కోట్ల తాజా షేర్లు
ఈకామర్స్ దిగ్గజం మీషో తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.4,250 కోట్లు సమీకరించనుంది. అలాగే కంపెనీలో ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో 17.57 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ ఇన్వెస్టర్లలో ఎలివేషన్, పీక్ ఎక్స్‌వీ, వెంచర్ హైవే, వై కాంబినేటర్ తదితర సంస్థలున్నాయి. తాజాగా సమీకరించే నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని క్లౌడ్ ఇన్‌ఫ్రా కంపెనీ మీషో టెక్నాలజీస్‌లో పెట్టుబడిగా వెచ్చించనుంది. మార్కెటింగ్, బ్రాండ్ కార్యకలాపాలు, ఇతర కంపెనీల కొనుగోళ్ల వంటి కార్పరేట్ అవసరాల కోసం కొంత మొత్తాన్ని ఖర్చు చేయనుంది.
షిప్‌రాకెట్ @ రూ.2,000–2,500 కోట్లు
ఐపీఓ ద్వారా లాజిస్టిక్స్ కంపెనీ షిప్‌రాకెట్ సుమారు రూ.2,000–2,500 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇక గుజరాత్‌కు చెందిన జర్మన్ గ్రీన్ స్టీల్ అండ్ పవర్ రూ.450 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు ప్రమోటర్లు ఓఎఫ్‌ఎస్ ద్వారా 20 లక్షల షేర్లు విక్రయించనున్నారు. ఐపీఓ నిధులను గుజరాత్ ప్లాంట్ విస్తరణతో పాటు హైబ్రీడ్ పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, రుణాల తిరిగి చెల్లింపుల కోసం ఉపయోగించుకోనుంది. స్మార్ట్ ఎనర్జీ మీటర్ల తయారీ సంస్థ అలైడ్ ఇంజనీరింగ్ వర్క్స్ తాజా షేర్ల జారీ ద్వారా రూ.400 కోట్ల సమీకరణపై కన్నేసింది. ప్రమోటర్ కూడా ఓఎఫ్‌ఎస్ రూట్లో 75 లక్షల షేర్లు విక్రయించనున్నారు.
మరోపక్క, ఎయిర్ కార్గో, లాజిస్టిక్స్ కంపెనీ స్కైవేస్ ఎయిర్ సర్వీస్ కూడా 3.29 కోట్ల తాజా ఈక్విటీ జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్లు, వాటాదారులు ఓఎఫ్‌ఎస్‌లో 1.33 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించే ప్రణాళికల్లో ఉన్నారు. రాజ్‌పుటానా స్టెయిన్‌లెస్ 1.46 కోట్ల మేర తాజా ఈక్విటీ జారీతో నిధులు సమీకరించనుంది. ప్రమోటర్ మరో 62.5 లక్షల షేర్లు అమ్మనున్నారు. ముంబైకి చెందిన మానిక ప్లాస్టెక్ రూ.115 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఓఎఫ్‌ఎస్ ద్వారా మరో రూ.1.5 కోట్ల విలువైన షేర్లను విక్రయించే ప్లాన్‌లో ఉంది.
ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
