ఐపీవోకి కల్యాణ్‌ జ్యుయలర్స్‌ | Sakshi
Sakshi News home page

ఐపీవోకి కల్యాణ్‌ జ్యుయలర్స్‌  

Published Fri, Mar 12 2021 8:48 AM

Kalyan Jewellers IPO to open on 16 March - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆభరణాల సంస్థ కల్యాణ్‌ జ్యుయలర్స్‌ తాజాగా ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ద్వారా రూ. 1,175 కోట్లు సమీకరించనుంది. షేరు ధరల శ్రేణిని రూ. 86-87గా నిర్ణయించారు. లాట్‌ సైజు 172 షేర్లుగా ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం మార్చి 16న ప్రారంభమయ్యే ఇష్యూ 18న ముగుస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు టీఎస్‌ కల్యాణరామన్‌ వివరించారు. యాంకర్‌ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌ మార్చి 15నే ప్రారంభమవుతుంది. ఐపీవోలో భాగంగా కొత్తగా రూ.800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద ప్రమోటర్లు రూ. 375 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటరు టీఎస్‌ కల్యాణరామన్‌ రూ. 125 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్టరయిన వార్‌బర్గ్‌ పింకస్‌ అనుబంధ సంస్థ హైడెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ దాదాపు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నాయి. ఈ ఏడాది మార్చి 9 నాటికి సంస్థలో ప్రమోటరు, ప్రమోటరు గ్రూప్‌నకు  67.99 శాతం వాటాలున్నాయి. 


నిర్వహణ మూలధన అవసరాలకు... 
ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్‌ క్యాపిటల్, కంపెనీకి సంబంధించిన ఇతరత్రా అవసరాల కోసం వినియోగించనున్నట్లు కల్యాణరామన్‌ పేర్కొన్నారు. ఇష్యూలో సగభాగాన్ని అర్హత పొందిన సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతాన్ని రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం భాగాన్ని సంస్థాగతయేతర బిడ్డర్లకు కేటాయించారు. దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే షేర్లను తమ ఉద్యోగులకు కల్యాణ్‌ జ్యుయలర్స్‌ కేటాయించింది. గతేడాది ఆగస్టులోనే ఐపీవోకి సంబంధించిన పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కంపెనీ దాఖలు చేయగా, అక్టోబర్‌లో అనుమతులు లభించాయి. యాక్సిస్‌ క్యాపిటల్, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ సంస్థలు ఈ ఐపీవోకి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 1993లో ప్రారంభమైన కల్యాణ్‌ జ్యుయలర్స్‌కి.. 2020 ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 107 షోరూమ్‌లు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో 30 స్టోర్స్‌ ఉన్నాయి.  
 

Advertisement
Advertisement