ఐదేళ్ల క్రితం అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగి వ్యాపార కార్యకలాపాలకు కొంత విరామం ప్రకటించిన జెఫ్ బెజోస్ మళ్లీ పూర్తిస్థాయి క్రియాశీలక యాజమాన్యంలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. కృత్రిమ మేధ రంగంలో రూపుదిద్దుకుంటున్న నూతన శకంలో భాగస్వామి అయ్యేందుకు ఆయన ప్రోమెథియస్ (Prometheus) అనే హై-టెక్ ఏఐ స్టార్టప్‌కు కో-సీఈఓగా బాధ్యతలు స్వీకరించడం గ్లోబల్ టెక్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘చూస్తూ కూర్చోలేకపోయాను’
ఈ అకస్మాత్ నిర్ణయానికి గల కారణాన్ని బెజోస్ ఇటీవల వెల్లడిస్తూ.. ‘ఏఐ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు, దాని అపరిమిత సామర్థ్యాన్ని నిశితంగా గమనించిన తర్వాత నేను కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాలేకపోయాను. ఈ సాంకేతిక పరిణామంలో భాగం కావడానికి పూర్తిస్థాయిలో పని చేయాల్సిందేనని నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు. ఈ తరహా కఠినమైన రోజువారీ విధులు తనకు శ్రమతో కూడిన సంతృప్తి ఇస్తాయని వ్యాఖ్యానించారు.
భౌతిక ప్రపంచం వైపు ఏఐ ప్రయాణం
సైంటిస్ట్ విక్ బజాజ్‌తో కలిసి బెజోస్ ఉమ్మడిగా నడిపిస్తున్న ప్రోమెథియస్ సంస్థ డిజిటల్ లేదా టెక్స్ట్ మోడళ్లకే పరిమితం కాకుండా భౌతిక ప్రపంచంలోని ఇంజినీరింగ్, తయారీ, ఆటోమోటివ్, ఏరోస్పేస్ రంగాల కోసం ఏఐ నమూనాలను అభివృద్ధి చేస్తోంది. ప్రారంభంలోనే 6.2 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణతో ప్రారంభమైన ఈ స్టార్టప్ ఇటీవల మరో 12 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించి 41 బిలియన్ డాలర్ల రికార్డు వ్యాల్యుయేషన్‌ను సొంతం చేసుకుంది.
ఉద్యోగాల కోతపై భిన్నమైన దృక్పథం
ఏఐ సాంకేతికత వల్ల లక్షలాది ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయన్న గ్లోబల్ ఆందోళనలను బెజోస్ తోసిపుచ్చారు. మానవ శ్రమకు ప్రత్యామ్నాయంగా ఏఐ మారదని, ఉత్పాదకతను పెంచే సాధనంగా మాత్రమే పని చేస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత పెరిగేకొద్దీ మానవ అవసరాలు, అవకాశాలు పెరుగుతాయని, ఫలితంగా భవిష్యత్తులో నిరుద్యోగం కంటే నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా..


