కేంద్రం సరళతర నిర్ణయాలతో ఐటీ షేర్లకు భారీ డిమాండ్‌

Information And Technology Stocks Jumped Near Three Per Cent  - Sakshi

సెన్సెక్స్‌ 393 పాయింట్లు అప్‌; 15,750 పైకి నిఫ్టీ

  కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ అంశాలు    

రాణించిన ఐటీ, మెటల్, ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు  

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ జూన్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు రోజున లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు అందాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రికవరీ కలిసొచ్చింది. ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్లకే కట్టుబడ్డారు. ఫలితంగా సెన్సెక్స్‌ 393 పాయింట్లు లాభపడి 52,699 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 15,790 వద్ద నిలిచింది. ఐటీ, మెటల్, ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్, ఆర్థిక, ఆటో షేర్లకు చెందిన కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి.

మరో వైపు ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఫార్మా, మీడియా, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వాయిస్‌ ఆధారిత బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (బీపీవో) కార్యకలాపాలకు భారత్‌ను ప్రధాన కేంద్రంగా నిలిపేందుకు కేంద్రం తీసుకున్న సరళతర నిర్ణయాలతో ఐటీ రంగ షేర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లతో ఒక దశలో సెన్సెక్స్‌ 525 పాయింట్లు పెరిగి 52,831 వద్ద, నిఫ్టీ 134 పాయింట్లు 15,821 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,891 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకోగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1,139 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రెండురోజూ బలపడింది. డాలర్‌ మారకంలో తొమ్మిది పైసలు ర్యాలీ చేసి 74.18 వద్ద స్థిరపడింది. 

‘‘గత ఆరునెలల్లో ఎన్నడూ లేనంతగా ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ తేదీన ఎన్‌ఎస్‌ఈలో అతి తక్కువ వ్యాల్యూమ్స్‌ నమోదయ్యాయి. దీంతో సూచీలు మార్కెట్‌ ఆరంభం నుంచి స్థిరమైన ట్రేడింగ్‌ను కనబరిచాయి. భారత మార్కెట్లో ద్రవ్య లభ్యతకు భరోసానిస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏప్రిల్‌లో 60 శాతం పెరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశపు నిర్ణయాలను విదేశీ ఇన్వెస్టర్లు ఆకళింపు చేసుకున్నారు. ఇప్పుడు అమెరికా ఉద్యోగ గణాంకాలు, వడ్డీరేట్లపై బ్రిటన్‌ నిర్ణయం అంశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు’’ జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top