గత నెలలో పుంజుకున్న గ్లోబల్ సేల్స్! భారీ స్థాయిలో దేశీయ ఉత్పత్తులు..

Indias manufacturing pmi at 4 month high in april - Sakshi

ఏప్రిల్‌లో పీఎంఐ సూచీ @ 56.4

న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్ల వృద్ధి, ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దేశీయంగా తయారీ కార్యకలాపాలు ఏప్రిల్‌లో పుంజుకున్నాయి. నాలుగు నెలల గరిష్టానికి చేరాయి. ఇందుకు సంబంధించిన పీఎంఐ సూచీ (ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) మార్చిలో 56.4 పాయింట్లు ఉండగా ఏప్రిల్‌లో 57.2 పాయింట్లకు పెరిగింది. 

సూచీ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దానికి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. అంతర్జాతీయంగా అమ్మకాలు పెరుగుతుండటం, సరఫరా వ్యవస్థపరమైన పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటివి కూడా ఇందుకు దోహదపడినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోల్యానా డి లిమా తెలిపారు. 

దీనికి సంబంధించిన సర్వే ప్రకారం..  ఈ ఏడాది ఇప్పటివరకు ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఉత్పత్తి వృద్ధి రేటు పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరిగిందని, తగ్గిపోయే నిల్వలను భర్తీ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలు కూడా మరింతగా ముడి సరుకులను కొనుగోలు చేస్తున్నాయని లిమా వివరించారు. భారతీయ తయారీ సంస్థలు ముందుకు దూసుకెళ్లడానికి పుష్కలమైన అవకాశాలు కనిపిస్తున్నాయని లిమా పేర్కొన్నారు. మార్కెట్లో సానుకూల పరిస్థితులు, డిమాండ్‌ మెరుగ్గా ఉండటం వంటి అంశాలు కొత్త ఆర్డర్లకు దోహదపడుతున్నాయని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top