 
													ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే దేశీయంగా డేటా సెంటర్ల (డీసీ) సామర్థ్యం 2027 నాటికి రెట్టింపు కానుంది. ప్రాజెక్టులను వేగవంతం చేస్తే 2030 నాటికి అయిదు రెట్లకు పెరగనుంది. డేటా లోకలైజేషన్ చట్టాలు, సానుకూల నియంత్రణ విధానాలు, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.
మెక్వారీ ఈక్విటీ రీసెర్చ్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 1.4 గిగావాట్ల డీసీ సామర్థ్యం ఉండగా, 1.4 గిగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 5 గిగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ వచ్చే అయిదేళ్లలో భారత్‌లో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది.
దీనికి తోడు టీసీఎస్ సైతం 6.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మెటా–గూగుల్ భాగస్వాములుగా జామ్‌నగర్‌లో సమగ్ర ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జియో ఇటీవల ప్రకటించింది. అలాగే ఏడబ్ల్యూఎస్ భారత్‌లో క్లౌడ్ కెపాసిటీని 2030 నాటికి 13 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు పెట్టనుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
