
గత పదిహేనేళ్లలో భారత రియల్టీ రంగంలో 80 బిలియన్ డాలర్ల(రూ.7 లక్షల కోట్లకుపైగా) పెట్టుబడులు ప్రవహించినట్లు క్రెడాయ్, కొలియర్స్ ఇక్కడ విడుదల చేసిన సంయుక్త నివేదిక వెల్లడించింది. 2010 నుంచి దేశీ రియల్టీ రంగం సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేసింది. గత దశాబ్దన్నర కాలం పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్లు 57 శాతం సమకూర్చినట్లు నివేదిక పేర్కొంది.
దేశీ రియల్టీ సమాఖ్య క్రెడాయ్, రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. క్రెడాయ్ నిర్వహించిన వార్షిక జాతీయ సదస్సు(నాట్కన్)లో ‘భారత రియాల్టీ: ఈక్విటీ పురోభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతం’ పేరిట నివేదికను వెలువరించాయి.
కోవిడ్ మహమ్మారి తదుపరి దేశీ పెట్టుబడులు సైతం పుంజుకున్నట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్ గ్రూప్‌లు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ప్రయివేట్ ఈక్విటీ, విదేశీ పెట్టుబడులున్న ఎన్‌బీఎఫ్‌సీలు, రీట్‌లు, సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉన్నట్లు నివేదిక వివరించింది.
దేశీ రియల్టీ మార్కెట్ పరిమాణం 2047కల్లా 5-10 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. 2047కల్లా దేశీ రియల్టీ రంగాన్ని కేవలం చదరపు అడుగులు లేదా ఆస్తుల విలువ ద్వారా కాకుండా కోట్లమంది ప్రజల కోసం సృష్టించిన నాణ్యమైన జీవనం ద్వారా మదింపు చేయవలసి ఉంటుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ వ్యాఖ్యానించారు.