Sakshi News home page

భారత్‌ ఫైనాన్షియల్‌ వ్యవస్థ పటిష్టం

Published Tue, May 9 2023 4:25 AM

Indian financial system well protected says economic affairs secretary Ajay Seth - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో  ఉన్నప్పటికీ,  భారత ఫైనాన్షియల్‌ వ్యవస్థ నియంత్రణలకు అనుగుణంగా  పటిష్ట బాటలో ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌  తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన 27వ ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరిస్తూ, ‘‘భారత్‌ ఫైనాన్షియల్‌ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది.

అయితే ఏదైనా తీవ్ర సమస్య సూచిక కనిపించిన వెంటనే మనం ఎల్లప్పుడూ అప్రమత్తం కావాలి. అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మన కాలిపై మనం నిలబడాలి’’ అని అన్నారు.  తద్వారా ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

► సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్,  సిగ్నేచర్‌ బ్యాంక్‌ వైఫల్యం అలాగే క్రెడిట్‌ సూచీ ఎదుర్కొంటున్న ద్రవ్య పరమైన ఒత్తిడి గురించి ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. వీటి ప్రభావం మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై లేదని భావిస్తున్నాం.  
► ప్రభుత్వ బాండ్ల మార్కెట్‌ విషయంలో సాంకేతికత వినియోగం మరింత పెంపొందేలా చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. పెట్టుబడిదారులు ఆర్‌బీఐ లేదా సెబీ ఇన్‌ఫ్రా ద్వారా ఇందుకు సంబంధించి పొందుతున్న సదుపాయాలకన్నా, సాంకేతికత ద్వారా పొందుతున్న ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. ఇవే సాంకేతిక చర్యల మరింత పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నాం.  
► అంతర్జాతీయంగా వస్తున్న ముందస్తు హెచ్చరిక సూచికలకు అనుగుణంగా భారత్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకోవడం,  ఆయా అంశాల్లో భారత్‌ సంసిద్ధత, నియంత్రణ నాణ్యతను మెరుగుపరచడం, దేశంలో కార్పొరేట్లు అలాగే గృహాల రుణ స్థాయిలు, కేవైసీ సరళీకరణ–క్రమబద్ధీకరణ, తద్వారా ఆర్థిక రంగంలో నియంత్రిత సంస్థలపై  అనవసర భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై కౌన్సిల్‌ చర్చించింది. ఆయా అంశాలన్నీ డిజిటల్‌ ఇండియా అవసరాలను తీర్చడానికి మరింత పటిష్ట ఫ్రేమ్‌వర్క్‌ని రూపొందిస్తాయని భేటీ భావించింది.  
► రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఎఫ్‌ఎస్‌డీసీ సబ్‌ కమిటీ నిర్ణయాలు, ఎఫ్‌ఎస్‌డీసీ గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కార్యాచరణ వంటి అంశాలపైనా తాజా కౌన్సిల్‌ దృష్టి సారించింది.  
► ఆర్‌బీఐ గవర్నర్‌తోపాటు, సెబీ చైర్‌పర్సన్‌ మాధవీ పురి బుచ్, ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ దేబాషిస్‌ పాండా, దివాలా బోర్డ్‌ (ఐబీబీఐ) చైర్మన్‌ రవి మిట్టల్, పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి చైర్మన్‌గా కొత్తగా నియమితులైన దీపక్‌ మెహంతీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ఆర్థికశాఖ సహాయమంత్రులు పంకజ్‌ చౌదరి, భగవత్‌ కృష్టారావు కరాద్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ వివేక్‌జోషి, తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.


అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల పరిష్కారంపై దృష్టి...
కాగా, ఎఫ్‌ఎస్‌డీసీ సమావేశం ప్రత్యేకించి బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల్లో  ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రెగ్యులేటర్లకు సూచించింది. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.  2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్‌క్లెయిమ్డ్‌  డిపాజిట్‌లను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ)  రిజర్వ్‌ బ్యాంక్‌కు బదిలీ చేశాయి.

దాదాపు 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించిన ఈ మొత్తాలను  గత 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఎవ్వరూ క్లెయిమ్‌ చేయలేదు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్‌ (రూ.4,558 కోట్లు), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. డిపాజిటర్లు, లబ్ధిదారులు వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల వివరాలను యాక్సెస్‌ చేయగల కేంద్రీకృత పోర్టల్‌ మూడు లేదా నాలుగు నెలల్లో సిద్ధమవుతుందని గత నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు.

Advertisement
Advertisement