భారత్‌ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం

Indian Exports May Touch1 Trillion By Fy 2027-28 Says Commerce Secretary Bvr Subrahmanyam - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు ఎగుమతుల భారీ వృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న పథకం ఇందులో ఒకటని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 419 బిలియన్‌ డాలర్లు భారత్‌ ఎగుమతుల లక్ష్యమని తెలిపారు.

గడచిన పదేళ్లలో ఎగుమతులు దాదాపు 290 బిలియన్‌ డాలర్లు– 330 బిలియన్‌ డాలర్ల మధ్య నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ దేశాలతో సహకారాన్ని (అనుసంధానం) భారత్‌ విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని వాణిజ్య శాఖ కార్యదర్శి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అది లేకుంటే ప్రపంచంతో విడిపోయినట్టుగానే ఉంటుందన్నారు. గత 20 ఏళ్లలో ప్రపంచ వాణిజ్య సంస్థ చెప్పుకోతగ్గ సాధించిందేమీ లేదంటూ.. అంతర్గత సమస్యల కారణంగా ఇంతకుమించి ఆశించడానికి కూడా ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. దీని కారణంగానే ప్రపంచ దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకార ఒప్పందాల దిశగా అడుగులు వేసినట్టు చెప్పారు. ‘‘ప్రాంతీయంగా మనకు ఎటువంటి సహకార ఒప్పందాలు లేవు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్‌ కోరుకునేట్టు అయితే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కలిగి ఉండాలి’’ అంటూ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం తన అభిప్రాయాలను వెల్లడించారు.   

భారీ పన్ను వసూళ్ల అంచనా: రెవెన్యూ కార్యదర్శి బజాజ్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) భారీ పన్ను వసూళ్లు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శ తరుణ్‌ బజాజ్‌ సీఐఐ సమావేశంలో పేర్కొన్నారు. కార్పొరేట్‌ రంగం పనితీరు ఊహించినదానికన్నా బాగుండడమే తమ ఈ అంచనాలకు కారణమని వివరించారు. ఆటో రంగంపై అధిక జీఎస్‌టీ రేట్లు ఉన్నాయన్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ అంశంపై జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిశీలన జరుగుతుందని, అధికంగా ఉన్న రేట్లను అవసరమైతే తగ్గిస్తుందని తెలిపారు. పన్ను పరిధిని పెంచడం ద్వారా స్థూల దేశీయోత్పత్తిలో పన్నుల నిష్పత్తి పెంపునకు మదింపు జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. భారత్‌లో పన్ను వసూళ్లు జీడీపీలో దాదాపు 10 శాతంగా ఉంటే, అభివృద్ధి చెందని దేశాల్లో దాదాపు 25 నుంచి 28 శాతం శ్రేణి ఉందని అన్నారు.   

చదవండి: ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top