
స్వల్ప–దీర్ఘకాలిక ప్రణాళికలపై కేంద్రం కసరత్తు
సెజ్‌ల నిబంధనలను సరళతరం చేసే యోచన
ఎగుమతిదార్లకు తక్షణం ఊరటనిచ్చేలా చర్యలు
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఎగుమతిదార్లకు తోడ్పాటు అందించడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం బహుళ వ్యూహాలపై వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. అలాగే ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్) సంబంధించిన పలు నిబంధనలను కూడా సరళతరం చేయడాన్ని కూడా పరిశీలిస్తోందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. సరళతరమైన రిటర్నుల నిబంధనలతో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తోందని వివరించారు.
ఎగుమతిదార్లకు ద్రవ్యలభ్యతపరంగా తక్షణం ఊరట కల్పించడం, బలహీనంగా ఉన్న రంగాల్లో ఆర్డర్లు .. ఉద్యోగాలు తగ్గిపోకుండా చూడటం, సంస్కరణలతో సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, కొత్త మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, ప్రస్తుత వాణిజ్య ఒప్పందాల నుంచి గరిష్టంగా ప్రయోజనాలను రాబట్టేందుకు ప్రయతి్నంచడంలాంటి విషయాలపై కార్యాచరణ ప్రణాళికలో ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు అధికారి చెప్పారు. ఇందుకోసం వాణిజ్య శాఖ మరో ద్విముఖ వ్యూహం కూడా రూపొందించింది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లాంటి ప్రస్తుత మార్కెట్లకు ఎగుమతులను పెంచడంతో పాటు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, తూర్పు ఆసియా, తూర్పు యూరప్‌లోని కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం ఇందులో ఉన్నాయి.
పరిశీలనలో ఉన్న మరిన్ని ప్రతిపాదనలు..
→ బ్రాండింగ్‌పరంగా తోడ్పాటు అందించడం. నిబంధనలు, లాజిస్టిక్స్ వ్యయాల భారాన్ని తగ్గించడం. ఎగుమతులతో పాటు దేశీయంగా వినియోగానికి కూడా ఊతమివ్వడం.
→ స్వల్పకాలిక ప్రణాళికల్లో భాగంగా .. లిక్విడిటీ సమస్యలను తగ్గించడానికి, దివాలా పరిస్థితులను నివారించడానికి, సెజ్‌లలో యూనిట్లకు నిబంధనలను మరింత సరళతరం చేయడానికి, నిర్దిష్ట దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకోవడం.
→ మధ్యకాలికంగా పరిశీలిస్తున్న అంశాల్లో వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో (ఎఫ్‌టీఏ) గరిష్టంగా ప్రయోజనాలను రాబట్టడం, దేశ–విదేశాల్లో కొనుగోలుదారులు–విక్రేతలను మరింతగా అనుసంధానించేందుకు ఎగ్జిబిషన్లలాంటివి నిర్వహించడం, పోటీతత్వాన్ని పెంచేలా జీఎస్‌టీ సంస్కరణలను పటిష్టం చేయడం ఉన్నాయి. చాలా మటుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) నిర్దిష్ట దేశాలతో టారిఫ్‌లపరమైన ప్రయోజనాల గురించి అంతగా తెలియకపోవడంతో ఎఫ్‌టీఏలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనేది మరో ప్రతిపాదన. ఇటీవలి కాలంలో ఆ్రస్టేలియా, యూఏఈ, జపాన్, కొరియాతో పాటు డజను పైగా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పొందడంపై వాటి ప్రయోజనాలను పొందడంపై భారత్ దృష్టి పెట్టనుంది. కొనుగోలుదారులను నేరుగా కలిసేందుకు దుస్తుల రంగానికి సంబంధించి ఆ్రస్టేలియాకు, రత్నాల విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి, తోలు ఉత్పత్తుల అంశంపై బ్రిటన్‌కు ఎగుమతిదార్ల ప్రతినిధి బృందాలను పంపించే అవకాశాలు పరిశీలించనుంది.
→ ఇక దీర్ఘకాలికంగా చూస్తే.. మన ఎగుమతులకు ఆటంకాలు ఉండని మార్కెట్లపై దృష్టి పెట్టడం, తదనుగుణంగా ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ను (ఈపీఎం) బలపేతం చేసుకోవడం, సెజ్ ని బంధనలను సంస్కరించడం, సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంలాంటి అంశాలు ఉన్నాయి.
→ టారిఫ్‌ల వల్ల పలు ఎగుమతిదార్లకు రావాల్సిన బాకీలు ఆలస్యం కావడం, ఆర్డర్లు రద్దు కావడంలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని వల్ల ఎగుమతిదార్లకు నిర్వహణ మూలధనం కొరతలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు, ఉద్యోగాలను కాపాడేందుకు పలు చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ప్రతిపాదిత జీఎస్‌టీ క్రమబద్దీకరణతో దేశీయంగా వినియోగానికి ఊతం లభిస్తుందని, డిమాండ్‌కి తగ్గట్లుగా ఇక్కడి మార్కెట్లో మరింతగా విక్రయించుకోవడానికి ఎగుమతిదార్లకు అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
ప్రభుత్వం ఓవర్‌టైమ్ పనిచేస్తోంది: సీఈఏ
ఎగుమతి రంగాలను టారిఫ్‌ల ప్రభావాల నుంచి కాపాడేందుకు తగిన వ్యూహాలను రూపొందించడానికి ఆర్థిక శాఖ, ఇతరత్రా శాఖలు మరింతగా పని చేస్తున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ తెలిపారు. టారిఫ్‌లు అమల్లోకి వచ్చాక గత మూడు, నాలుగు రోజుల నుంచి పరిశ్రమ ప్రతినిధులతో సమాలోచనలు జరుగుతున్నాయని పరిశ్రమల సమాఖ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. సంక్షోభాలు చిన్నవైనా, పెద్దవైనా, సాధారణంగా వాయిదా వేసుకునే ప్రణాళికలను సత్వరం అమలు చేసేలా దృష్టి పెట్టేందుకు సమాజంలోని అన్ని వర్గాలను (ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, కుటుంబాలు) ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు. ప్రభావిత ఎగుమతి రంగాలు, యూనిట్లకు ఆర్థికంగా, సమయంపరంగా కాస్త వెసులుబాటు లభించేలా చూడాలనేది తక్షణ లక్ష్యంగా ఉందని నాగేశ్వరన్ చెప్పారు.
గ్లోబల్ ఎగ్జిబిషన్లకు నిధులు కేటాయించాలి: జీటీఆర్‌ఐ
ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలకు నిధులు తగ్గిపోవడంపై మేధావుల సంఘం గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఏఐ) కింద గ్లోబల్ ఎగ్జిబిషన్లలో ఎగుమతిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా రూ. 2,500 కోట్లు కేటాయించడాన్ని పరిశీలించాలని సూచించింది. ఎంఏఐకి ఈసారి అస్సలు నిధులే విడుదల చేయకపోవడంతో, సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ఏప్రిల్, ఆగస్టుల్లో విదేశీ ఎగ్జిబిషన్లలో ఎగుమతిదార్లు పాల్గొనలేకపోయారని పేర్కొంది.
‘440 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే ఎకానమీ గత అనేక సంవత్సరాలుగా రూ. 250 కోట్ల స్కీముతో నెట్టుకొస్తోంది. దీన్ని ఏటా రూ. 2,500 కోట్లకు పెంచాలి. కనీసం ఏడాది ముందుగా ఆ నిధులను విడుదల చేస్తే, అత్యంత ప్రయోజనకరంగా ఉండే గ్లోబల్ ఎగ్జిబిషన్లలో మన సంస్థలు పాల్గొనేందుకు వీలవుతుంది‘ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. వడ్డీ రాయితీ పథకాన్ని (ఐఈఎస్) పునరుద్ధరించాలని, ఈ–కామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్‌లను తక్షణం పూర్తిస్థాయిలో విస్తరించాలని సూచించారు. 2025 ఏప్రిల్‌లో ఐఈఎస్‌ను నిలిపివేయడం వల్ల అధిక వడ్డీల భారంతో ఎంఎస్‌ఎంఈలు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల కారి్మక శక్తి ఎక్కువగా ఉండే టెక్స్‌టైల్స్, తోలు, హస్తకళలు, ఇంజినీరింగ్ ఉత్పత్తుల్లాంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని శ్రీవాస్తవ చెప్పారు.