
2030 నాటికి 107 గిగావాట్లు
ప్రస్తుత సామర్థ్యం కంటే రెట్టింపు
అంతర్జాతీయ పవన విద్యుత్ మండలి
న్యూఢిల్లీ: భారత్‌లో పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాలు వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం 51 గిగావాట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యం ఉండగా.. 2030 నాటికి 107 గిగావాట్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ పవన విద్యుత్ మండలి (జీడబ్ల్యూఈసీ) తెలిపింది. 2030 నాటికి 100 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
భారత పర్యావరణ అనుకూల ఇంధన ఆకాంక్షలకు పవన విద్యుత్ కీలకంగా ఉండడమే కాకుండా, అంతర్జాతీయంగానూ ప్రభావం చూపిస్తున్నట్టు నివేదికలో పేర్కొంది. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సెక్రటరీ సంతోష్ కుమార్ సారంగి సమక్షంలో ఈ నివేదికను జీడబ్ల్యూఈసీ విడుదల చేసింది. భారత్ ఇంధన పరివర్తనను తక్కువ ఖర్చుతో విజయవంతంగా సాధించేందుకు పవన విద్యుత్ సాయంగా నిలుస్తుందని తెలిపింది.
పవన విద్యుత్ టర్బయిన్ల ఉత్పత్తి పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ అవసరాల్లో 10 శాతాన్ని భారత్ పరిశ్రమ తీర్చనుందని, 1,54,000 మందికి ఉపాధి కల్పించనుందని వెల్లడించింది. పరిశ్రమ గణాంకాల ప్రకారం గతేడాది భారత్ 3 గిగావాట్ల పవన విద్యుత్ ఎక్విప్‌మెంట్‌ను ఎగుమతి చేయగా, అంతర్జాతీయంగా ఎగుమతి మార్కెట్ పరిమాణం 117 గిగావాట్లుగా ఉంది. ఈ ఏడాది 135 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ ఎగుమతుల్లో 60 శాతం చైనా సమకూరుస్తోంది.
500 గిగావాట్ల సామర్థ్యం సాధిస్తాం..
2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తామని కేంద్ర నూతన, పనరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందులో 100 గిగావాట్లు పవన విద్యుత్ రూపంలో ఉంటుందన్నారు. భారత్ కేవలం శుద్ధ ఇంధన సదుపాయాలనే సమకూర్చుకోవడం లేదంటూ భవిష్యత్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. 30 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ప్రాజెక్టుల అమలు వివిధ దశల్లో ఉన్నట్టు సంతోష్ కుమార్ సారంగి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. వచ్చే కొన్నేళ్లలో ఇవి కార్యకలాపాలు మొదలు పెడతాయని చెప్పారు.
ముఖ్యంగా ఈ ఏడాది ఆరు నుంచి ఏడు గిగావాట్ల సామర్థ్యం అదనంగా కార్యకలాపాల్లోకి వస్తుందన్నారు. అమెరికా టారిఫ్‌లు పునరుత్పాదక ఇంధన ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చంటూ, భారత్ నుంచి అమెరికాకు సోలార్, విండ్ ఎగుమతులు పెద్దగా లేవన్నట్టు చెప్పారు. 2030 నాటికి ప్రపంచ విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సగం ఉంటుందని, ఇందులో పవన విద్యుత్ వాటా 20–25 శాతం మేర ఉంటుందని ప్రపంచ పవన విద్యుత్ మండలి ఇండియా చైర్మన్ గిరీష్ తంతి తెలిపారు.