త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు | India trade agreements with US and EU according to Nirmala Sitharaman, More Details Inside | Sakshi
Sakshi News home page

త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు

Jun 25 2025 9:08 AM | Updated on Jun 25 2025 10:48 AM

India trade agreements with US and EU according to Nirmala Sitharaman

చర్చలు వేగంగా, ఫలప్రదంగా సాగుతున్నాయి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

అమెరికా, ఐరోపా యూనియన్‌ (ఈయూ)లతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఎంతో వేగవంతంగా, ఫలప్రదంగా కొనసాగుతున్నాయని.. త్వరలోనే ముగుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 2030 నాటికి 2 ట్రిలియన్‌ డాలర్ల ప్రతిష్టాత్మక ఎగుమతుల లక్ష్యాలన్ని చేరుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే యూఏఈ, ఆస్ట్రేలియా, నాలుగు దేశాలతో కూడిన యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఈఎఫ్‌టీఏ)తో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను మంత్రి ప్రస్తావించారు. యూకేతో చర్చలు ముగిసినట్టు చెప్పారు. మరిన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికే తమ ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు. ఇండియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నిర్వహించిన వాణిజ్య సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.

2024–25 ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతులు రికార్డు స్థాయిలో 825 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్‌ గుర్తు చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. ఇదే కాలంలో అంతర్జాతీయంగా ఎగుమతుల్లో వృద్ధి 4 శాతంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. 2013–14లో ఎగుమతులు 466 బిలియన్‌ డాలర్లతో పోల్చి చూస్తే గణనీయంగా వృద్ధి చెందినట్టు తెలిపారు.

ఆవిష్కరణలపై దృష్టి సారించాలి..

ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఎగుమతిదారులకు మంత్రి సీతారామన్‌ పిలుపునిచ్చారు. తమ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం 11 శాతం తగ్గిన సమయంలోనూ భారత్‌ మెరుగైన పనితీరు చూపించిందన్న యూఎన్‌సీటీఏడీ నివేదికను ప్రస్తావించారు. గడిచిన 24 ఏళ్లలో భారత్‌ 991 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐని ఆకర్షించగా, అందులో 67 శాతం (668 బిలియన్‌ డాలర్లు) 2014–2024 మధ్యకాలంలో వచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్‌ మరింత అనుసంధామైనందన్నారు. యాపిల్‌ ఐఫోన్‌ భారత కాంట్రాక్టు తయారీదారులు దేశీయంగా 20 శాతం విలువ జోడింపును సాధించినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. భారత వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు.  

భారత్‌లో టారిఫ్‌లు చాలా తక్కువ

భారత్‌ను టారిఫ్‌ కింగ్‌ అన్న ఆరోపణలను మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా ఖండించారు. 2025–26 బడ్జెట్‌లో మొత్తం టారిఫ్‌లను ఎనిమిదింటికి తగ్గించామని చెబుతూ.. వాస్తవ రేటు ఎంతో తక్కువ అని స్పష్టం చేశారు. తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహకంగా టారిఫ్‌ల సంఖ్యను కుదించినట్టు చెప్పారు. భారత్‌ను టారిఫ్‌ కింగ్‌గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకటికి మించిన సందర్భాల్లో వ్యాఖ్యానించిన నేపథ్యంలో మంత్రి ఈ స్పష్టతనిచ్చారు. 2023–24 బడ్జెట్‌లో ఏడు టారిఫ్‌లను మంత్రి సీతారామన్‌ తొలగించగా, ఇటీవలి బడ్జెట్‌లోనూ మరో ఏడు టారిఫ్‌ రేట్లను ఎత్తివేయడం గమనార్హం. దీంతో భారత సగటు కస్టమ్స్‌ సుంకం 11.65 శాతం నుంచి 10.66 శాతానికి దిగొచ్చినట్టు మంత్రి తెలిపారు. దక్షిణాసియా దేశాల స్థాయిలోనే ఇది ఉన్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్‌కార్డులున్నాయా?

పన్ను ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి

పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం, సకాలంలో రిఫండ్‌లను ప్రాసెస్‌ చేయడంపై దృష్టి సారించాలంటూ ఆదాయపన్ను శాఖ అధికారులకు మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్ల సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రత్యక్ష హాజరు అవసరం లేని అప్పిలేట్‌ ట్రిబ్యునళ్ల ముందు పెండింగ్‌లో ఉన్న వివాదాస్పదన పన్ను డిమాండ్లను వేగంగా పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సకాలంలో పరిష్కారం చూపించడం వల్ల వ్యవస్థపై పన్ను చెల్లింపుదారుల్లో విశ్వాసం ఇనుమడిస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement