
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నిర్ణయాల వల్ల చాలా దేశాలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సి వస్తుంది. భారతదేశం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. టారిఫ్ బెదిరింపులు చాలా దేశాలు అమలు చేస్తున్న విధానాల్లో మార్పులకు దారితీస్తున్నాయి. అందులో భాగంగా భారత్ తాజాగా 6 శాతం ‘గూగుల్ ట్యాక్స్’ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి.
గూగుల్, మెటా.. వంటి విదేశీ టెక్ కంపెనీలు అందించే ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ సేవలపై ‘గూగుల్ ట్యాక్స్’ అని పిలువబడే 6 శాతం ఈక్వలైజేషన్ లెవీని భారతదేశం తొలగించే అవకాశం ఉంది. ఫైనాన్స్ బిల్లులో సవరణల నేపథ్యంలో 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ పన్నును రద్దు చేయనున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన ఈ లెవీ భారత మార్కెట్‌కు గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించే సాధనంగా ఉండేది. విదేశీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఉనికి భారత్‌లో భౌతికంగా లేకపోయినా కేంద్ర ఖజానాకు తమ వాటాను అందించేలా ప్రత్యేకంగా ఈ లెవీని రూపొందించినట్లు సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ పార్టనర్ తుషార్ కుమార్ తెలిపారు. ఆదాయపు పన్నుకు లోబడి ఉన్న దేశీయ సంస్థలు, సంప్రదాయ అంతర్జాతీయ పన్ను నిబంధనలకు లోబడి ఉన్న విదేశీ సాంకేతిక సంస్థల కార్యకలాపాలను సమతుల్యం చేయడమే ఈ లెవీ ప్రాథమిక లక్ష్యమని వివరించారు.
గూగుల్ ట్యాక్స్‌ను కేంద్రం ఎందుకు తొలగిస్తుంది?
ఈ లెవీ తొలగింపు భారతదేశం డిజిటల్ పన్నుల చట్రంలో మార్పును సూచిస్తుంది. గూగుల్, మెటా వంటి అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలపై పన్ను వివక్షాపూరితంగా ఉందని నిరంతరం అభ్యంతరం వ్యక్తం చేసిన యూఎస్‌తో వాణిజ్య ఘర్షణలను తగ్గించడానికి ఇది వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తుందని కుమార్ అన్నారు. గతంలో ఈ లెవీ విదేశీ డిజిటల్ కంపెనీలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందనే వాదనలున్నాయి. భారతీయ వ్యాపారాలకు అందించే ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ సేవల ద్వారా వచ్చే ఆదాయంపై 6 శాతం పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. పర్యవసానంగా, ఈ ఖర్చుల భారం ప్రకటనదారులపైనే పడేది. తద్వారా భారతీయ సంస్థలకు డిజిటల్ మార్కెటింగ్ ఖర్చులు పెరిగాయని కుమార్ అన్నారు.
ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
టెక్ దిగ్గజాలకు ప్రయోజనం చేకూరుతుందా?
ఈక్వలైజేషన్ లెవీ రద్దుతో విదేశీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లపై పన్ను భారం తగ్గుతుంది. తద్వారా మరింత అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించవచ్చు. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ అడ్వర్టైజింగ్ సేవలను పొందే భారతీయ వ్యాపారాలపై మార్కెటింగ్ ఖర్చుల భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మరింత డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది.