రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ పథకం సిద్ధం! | India Plans 2.5 Lakh Cr Credit Guarantee Shield to Protect MSMEs Aviation | Sakshi
Sakshi News home page

రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ పథకం సిద్ధం!

Apr 7 2026 11:32 AM | Updated on Apr 7 2026 11:37 AM

India Plans 2.5 Lakh Cr Credit Guarantee Shield to Protect MSMEs Aviation

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో అంతరాయాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ సంక్షోభం వల్ల దెబ్బతిన్న వివిధ రంగాలను ఆదుకునేందుకు సుమారు రూ.2.5 లక్షల కోట్ల భారీ క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొవిడ్ సమయంలో ఎంఎస్‌ఎంఈలను ఆదుకున్న ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్’ (ఈసీఎల్‌జీఎస్‌) తరహాలోనే ఈ నూతన ప్యాకేజీ ఉండబోతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

వ్యాపారాలకు రక్షణ కవచం

ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్యలను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఈ పథకం ఊపిరి పోయనుంది. ఇందులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.

  • ఈ పథకం కింద వ్యాపారాలు పొందే రుణాలకు నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) ద్వారా 90 శాతం క్రెడిట్ గ్యారెంటీ లభిస్తుంది. ఒకవేళ రుణగ్రహీత డిఫాల్ట్ అయితే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.

  • ఈ పథకం సుమారు నాలుగేళ్ల పాటు అమలులో ఉండే అవకాశం ఉంది.

  • వివిధ రంగాలు, ఉప-రంగాలకు సుమారు రూ.100 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

  • గత అనుభవాల దృష్ట్యా రుణాలను చౌకగా అందించేందుకు బ్యాంకుల వడ్డీ రేటును 9.25 శాతం, ఎన్‌బీఎఫ్‌సీల వడ్డీ రేటును 14 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉంది.

  • అసలు మొత్తం తిరిగి చెల్లింపుపై ఏడాది పాటు మారటోరియం లభిస్తుంది. అయితే, ఈ కాలంలో వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.

విమానయాన, ఎంఎస్‌ఎంఈ రంగాలపై ప్రత్యేక దృష్టి

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా విమాన మార్గాల మళ్లింపు, ఇంధన ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చులు పెరగడంతో విమానయాన రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ రంగానికి తక్షణ మద్దతు అవసరమని అధికారులు గుర్తించారు. ‘ప్రస్తుతం లిక్విడిటీ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న విమానయానం, ఎంఎస్‌ఎంఈలు, ఇతర కీలక వ్యాపారాలకు అండగా నిలవడమే మా ప్రాధాన్యత. ఇరాన్ సంక్షోభం వల్ల విమానయాన కార్యకలాపాల్లో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మద్దతు అవసరం’ అని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.

ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement