
ఆగస్టులో 137 శాతం జంప్
భారత్ నుంచి యురోపియన్ యూనియన్(ఈయూ)కు చేసే చమురు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన ఆగస్టు నెలలో 137 శాతం డీజిల్ ఎగుమతులు పుంజుకున్నాయి. ఇవి రోజుకు సుమారు 2,42,000 బ్యారెల్స్(బీపీడీ)కు చేరుకున్నాయి. 2026 జనవరిలో రష్యన్ క్రూడాయిల్ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తులపై ఈయూ నిషేధం విధించడమే ఇలా దేశీయ డీజిల్ ఎగుమతులు పుంజుకోవడానికి కారణమని తెలుస్తుంది.
రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుతో శుద్ధి చేసిన ఉత్పత్తులపై ఈయూ ఆంక్షలు విధించింది. ఇవి వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. దానికి ముందే యురోపియన్ కొనుగోలుదారులు ఇంధన సరఫరాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఇండియా వంటి దేశాల్లో రిఫైనరీ కంపెనీలతో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను సరఫరా చేయాలనేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దాంతో ఇండియాలో ఈయూకు చేసే డీజిల్ ఎగుమతులు పెరిగాయి.
భారత కంపెనీలకు ప్లస్
రష్యా ఎగుమతులపై ఈయూ, జీ7 దేశాలు ధరల పరిమితి, ముడిచమురు ఆంక్షలు విధించాయి. దాంతో భారతీయ రిఫైనరీలు డిస్కౌంట్ ధరలకు రష్యా ముడి చమురును దిగుమతి చేసుకొని, శుద్ధి చేయడం, చట్టబద్ధంగా డీజిల్, జెట్ ఇంధనాన్ని యూరప్‌కు తరలించడం పెరిగింది. భారతీయ రిఫైనరీలు ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, ఎంఆర్‌పీఎల్ ఈ ఎగుమతులను పెంచడానికి డిస్కౌంట్ క్రూడ్‌ను భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. 2024 మొదటి మూడు త్రైమాసికాల్లో ఈయూకు ఇంధన ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58% పెరిగాయి.
రష్యా చమురుపై ఆంక్షలు ఎందుకు?
రష్యన్ క్రూడ్ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తుల తయారీపై ఈయూ ఆంక్షలు విధించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆదాయాన్ని తగ్గించేందుకు జీ7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఆంక్షలు 2026 జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. రవాణా, వ్యవసాయం, పరిశ్రమలకు డీజిల్ కీలకం. డీజిల్, డీజిల్ గ్రేడ్ క్రూడాయిల్ సరఫరాలో రష్యా అగ్రస్థానంలో ఉంది.
ఇదీ చదవండి: మన గోప్యత బజారుపాలు!