భారత్‌లో 2026 ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. వినియోగదారుల ధరల సూచీ (CPI) ప్రకారం ఇది 3.48 శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 3.4 శాతంగా ఉండగా, ఇప్పుడు స్వల్పంగా పెరిగింది.
పైకి చూస్తే ఈ పెరుగుదల పెద్దగా ప్రమాదకరంగా కనిపించకపోయినా, అసలు ఆందోళన కలిగిస్తున్న అంశం టోకు ధరల ద్రవ్యోల్బణం (Wholesale Inflation). మార్చిలో 3.88 శాతంగా ఉన్న హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్, ఏప్రిల్‌లో 8.3 శాతానికి ఎగసిపడింది. ఇది గత 42 నెలల్లోనే అత్యధిక స్థాయి.
ఈ గణాంకాలు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల్లో పెరుగుతున్న వ్యయభారం ఇంకా పూర్తిగా వినియోగదారులపై పడలేదని సూచిస్తున్నాయి. అంటే రాబోయే నెలల్లో సాధారణ ప్రజలపై ధరల భారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం ఇంధన, విద్యుత్ ధరల పెరుగుదల. ఫ్యూయల్, పవర్ విభాగంలో ధరలు 24.71 శాతం పెరిగాయి. ముఖ్యంగా పెట్రోలియం, సహజ వాయువు ధరలు 67 శాతానికి పైగా ఎగిశాయి.
ఇంధన వ్యయాల పూర్తి ప్రభావం ఇంకా వినియోగదారులకు చేరలేదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ భారం ఇక తప్పనిసరిగా ప్రజలపై పడే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలకు దాదాపు రూ.30 వేల కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయని సమాచారం.
దీంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్ప కేంద్రానికి మరో మార్గం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల వ్యాఖ్యానించారు. రిటైల్ ఇంధన ధరల్లో పెరుగుదల అంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి.
కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ మార్చిలో 3.87 శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో అది 4.2 శాతానికి చేరింది. వాణిజ్య LPG సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవల ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత 19.2 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.850 నుంచి రూ.1000 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
ఆహార ఖర్చులు పైపైకి..
వలస కార్మికులు ఎక్కువగా ఉపయోగించే 5 కిలోల సిలిండర్ల ధరలు కూడా పలు ప్రాంతాల్లో రూ.200కు పైగా పెరిగాయి. ఇది నేరుగా ప్రజల ఆహార ఖర్చులను పెంచడమే కాకుండా వినియోగ డిమాండ్‌ను కూడా తగ్గించే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు, వివాహాలు, విదేశీ పర్యటనల వంటి ఖరీదైన ఖర్చులను తగ్గించాలని, బంగారం వంటి విలువైన లోహాల కొనుగోళ్లు నియంత్రించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు.
దీనికి కొనసాగింపుగా బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను పెంచింది. భారతీయులు ‘సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్’గా భావించే బంగారం, వెండిపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా రూపాయిపై ఒత్తిడిని తగ్గించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. గత రెండున్నర నెలల్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ దాదాపు 8.5 శాతం పడిపోయింది.
ఇది సాధారణ పరిస్థితి కాదు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూపాయి సగటున ఏడాదికి 2 నుంచి 3 శాతం మాత్రమే బలహీనపడింది. దీంతో ప్రస్తుత పరిస్థితి తీవ్రమైన నిర్మాణాత్మక ద్రవ్యోల్బణ ఒత్తిడిని సూచిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సీపీఐ (Consumer Price Index), డబ్ల్యూపీఐ (Wholesale Price Index) మధ్య భారీ అంతరం ఉండటం వల్ల ఉత్పత్తిదారులు పెరిగిన వ్యయాన్ని ఇంకా పూర్తిగా వినియోగదారులపై మోపలేదని అర్థమవుతోంది.
కానీ ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగదని అంచనా. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన 2 నుంచి 6 శాతం పరిమితిలో ఉంచేందుకు RBI వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితి రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ద్రవ్యోల్బణం తాత్కాలిక ధరల పెరుగుదల కాదని, ఇది వ్యవస్థాత్మక ఆర్థిక ఒత్తిడి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


