ఇంధన భద్రతే ముఖ్యం | India Energy Security Critical Minerals Key to Long Term Economic Stability | Sakshi
Sakshi News home page

ఇంధన భద్రతే ముఖ్యం

May 28 2026 8:29 AM | Updated on May 28 2026 8:29 AM

India Energy Security Critical Minerals Key to Long Term Economic Stability

ఇంధన భద్రత, క్రిటికల్‌ మినరల్స్‌ (కీలక ఖనిజాలు), వనరుల నియంత్రణ అన్నవి భవిష్యత్‌ ఆర్థిక ఆధిపత్యానికి ఎంతో కీలకమని భూమి వెంచర్స్‌ సీఈవో, వేదాంత గ్రూప్‌ మాజీ సీఈవో అయిన సునీల్‌ దగ్గల్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ ప్రపంచంలోమూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉందంటూ, తన అవసరాల్లో 88–89 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే గ్యాస్‌ డిమాండ్‌లో సగాన్ని దిగుమతుల రూపంలోనే తీర్చుకుంటున్నట్టు తెలిపారు. కనుక భారత్‌ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వానికి ఇంధన భద్రత ఎంతో కీలకమన్నారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పారిశ్రామిక సరఫరాలు, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలను మార్చివేస్తున్న పరిస్థితులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాహ్య ఇంధన సరఫరాలపై ఎక్కువగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు గత కొన్నేళ్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఇంధన సమీకరణాలను మార్చగా, అమెరికా–ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణలు ‘హార్మూజ్‌ జలసంధి’ వంటి చమురు రవాణా మార్గాల ప్రాధాన్యతను గుర్తుచేసినట్టు పేర్కొన్నారు. భారతదేశ ముడిచమురు దిగుమతుల్లో 45 శాతం హార్మూజ్‌ జలసంధి ద్వారానే వస్తున్నందున, పశ్చిమాసియాలో స్థిరత్వం భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్నారు. ఆయిల్‌ ధరలు పెరిగిన ప్రతిసారీ వాణిజ్య లోటు విస్తరించి, ద్రవ్యోల్బణ ఒత్తిడులు అధికమవుతాయంటూ.. ఇది దేశ తయారీ రంగ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని దగ్గల్‌ హెచ్చరించారు.  

కీలక ఖనిజాల ప్రాధాన్యత..

పరిమిత ఇంధన వనరులపై ఆధారపడిన ఏ దేశమూ దీర్ఘకాలిక ఆర్థిక సార్వభౌమాధికారాన్ని సాధించలేదని సునీల్‌ దగ్గల్‌ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్లు, ఏఐ సదుపాయాలు, రక్షణ టెక్నాలజీలకు అవసరమైన కీలక ఖనిజ వనరులు, ప్రాసెసింగ్‌ సామర్థ్యాలపైనే తదుపరి దశ అంతర్జాతీయ పోటీతత్వం ఆధారపడి ఉంటుందన్నారు. గత శతాబ్దంలో చమురుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. రాబోయే రోజుల్లో కీలక ఖనిజాలకు అంతటి ప్రాముఖ్యత ఉంటుందని దుగ్గల్‌ పేర్కొన్నారు. 

లిథియం, కాపర్, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్, అరుదైన భూ ఖనిజాల (రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌) వెలికితీత, శుద్ధి, సరఫరా గొలుసులను నియంత్రించే దేశాలే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తాయని ఆయన చెప్పారు. కనుక ఇంధన పరివర్తనను కేవలం పర్యావరణ పరమైన మార్పుగా కాకుండా.. ఒక వ్యూహాత్మక పారిశ్రామిక మార్పుగా చూడాలన్నారు. 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారద్‌ కీలక వనరులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ సరఫరాలపై అతిగా ఆధారపడటం సరికాదని ఆయన హెచ్చరించారు. మైనింగ్, లోహాలు, రవాణా, మౌలిక సదుపాయాలను కేవలం పరిశ్రమలుగా కాకుండా వ్యూహాత్మక ఆర్థిక స్తంభాలుగా చూడాలని సూచించారు.

ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

Advertisement
 
Advertisement
Advertisement