ఎనర్జీపై 170 బిలియన్‌ డాలర్లకు పెట్టుబడులు | India energy investment reach a record 170 billion dollers in 2026 | Sakshi
Sakshi News home page

ఎనర్జీపై 170 బిలియన్‌ డాలర్లకు పెట్టుబడులు

May 31 2026 5:44 AM | Updated on May 31 2026 5:44 AM

India energy investment reach a record 170 billion dollers in 2026

సోలార్‌పై పీవీలపై 25 శాతం, రిఫైనింగ్‌పై 23 శాతం వృద్ధి 

2026పై ఐఈఏ నివేదిక 

న్యూఢిల్లీ: దేశీయంగా ఇంధనాలకు డిమాండ్‌ పెరుగుతుండటం, స్వచ్ఛ ఇంధనాలవైపు భారత్‌ వేగంగా మళ్లుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఎనర్జీ రంగంపై పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. సౌర విద్యుత్, ఆయిల్‌ రిఫైనింగ్‌ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తుడటంతో పెట్టుబడులు 2026లో 170 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఒక నివేదికలో వెల్లడించింది.

 ఎనర్జీ రంగంపై పెట్టుబడులు గత ఐదేళ్లుగా ఏటా 11 శాతం వృద్ధి చెందుతుండగా, వార్షికంగా సోలార్‌ ఫొటోవోల్టెయిక్‌ (పీవీ) ఏటా 25 శాతం, ఆయిల్‌ రిఫైనింగ్‌లో 23 శాతం పెరిగాయని పేర్కొంది. మొత్తం ఎనర్జీ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్‌లో ఈ రెండు రంగాల వాటా దాదాపు పావు శాతం ఉన్నట్లు తెలిపింది. భారీ పెట్టుబడుల దన్నుతో 2030 నాటికి రిఫైనింగ్‌ సామర్థ్యాలు 15 శాతం మేర పెరగనున్నట్లు రిపోర్ట్‌ పేర్కొంది. బొగ్గు సరఫరాకు సంబంధించి గత దశాబ్దకాలంలో భారత్‌ పెట్టుబడులు మూడింతలు పెరిగినట్లు వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. 

→ ఇటు విద్యుదుత్పత్తికి, అటు పారిశ్రామిక అవసరాలకి బొగ్గుకు భారీ డిమాండ్‌ కొనసాగుతోంది. దేశీయంగా ప్రస్తుతం 1 బిలియన్‌ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తిని 2030 నాటికి 1.5 బిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని భారత్‌ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో 2026లో బొగ్గు సరఫరాపై పెట్టుబడులు 13 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి.  

→ పునరుత్పాదక విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గ్రిడ్‌ ఆధునీకరణ, బ్యాటరీ స్టోరేజ్‌పైనా భారత్‌ మరింతగా ఇన్వెస్ట్‌ చేస్తోంది. దేశీయంగా స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన పెట్టుబడుల్లో ప్రస్తుతం సౌర, పవన విద్యుత్‌ వాటా సగానికి పైగా ఉంటోంది. దీనితో విద్యుత్‌ పంపిణీ, స్టోరేజ్‌ వ్యవస్థలను అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం పెరుగుతోంది.  

→ 2020 నుంచి జల విద్యుత్, అణు విద్యుత్‌పై పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం 9 గిగావాట్లుగా ఉన్న అణు విద్యుత్‌ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచుకోవాలని భారత్‌ నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా 49 శాతం వరకు విదేశీ ఓనర్‌షిప్‌తో రియాక్టర్ల నిర్మాణానికి ప్రైవేట్‌ కంపెనీలకు అనుమతినిస్తూ 2205లో సంస్కరణలను ప్రవేశపెట్టింది.  

→ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌పై 2026లో పెట్టుబడులు 26 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. గత ఐళ్లుగా ఇవి వార్షికంగా 15 శాతం మేర పెరుగుతున్నాయి. పునరుత్పాదక విద్యుత్‌ను, జాతీయ..రా్రïÙ్టయ గ్రిడ్‌లకు అనుసంధానించేందుకు ఉద్దేశించిన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ప్రోగ్రాంతో 3,000 కి.మీ. పైగా ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ఏర్పాటయ్యాయి. తదుపరి దశల పనులు కొనసాగుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement