స్మార్ట్‌ఫోన్‌ల్లో ‘ఆధార్’ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌పై అప్‌డేట్‌ | India Drops Aadhaar App Pre Installation Plan Amid Privacy Concerns | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ల్లో ‘ఆధార్’ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌పై అప్‌డేట్‌

Apr 18 2026 12:15 PM | Updated on Apr 18 2026 12:51 PM

India Drops Aadhaar App Pre Installation Plan Amid Privacy Concerns

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ప్రయోజనాలు, టెక్ కంపెనీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విక్రయించే యాపిల్, శామ్‌సంగ్‌ వంటి ప్రముఖ కంపెనీల ఫోన్లలో ఆధార్ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ (ప్రీ-ఇన్‌స్టాలేషన్‌) చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. గత కొద్ది కాలంగా ఈ అంశంపై పరిశ్రమ వర్గాల్లో జరుగుతున్న చర్చకు ఈ నిర్ణయంతో తెరపడినట్లయింది.

పరిశ్రమ వర్గాల వ్యతిరేకతే కారణమా?

రాయిటర్స్ నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌ల్లో ఆధార్ యాప్‌ను తప్పనిసరిగా చేర్చాలన్న ప్రతిపాదనపై యాపిల్, శామ్‌సంగ్‌ వంటి గ్లోబల్ టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ(మైటీ) పరిశ్రమకు చెందిన వివిధ వాటాదారులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల అనంతరం స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం సరైన నిర్ణయం కాదని కేంద్రం భావించినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించింది.

ఏమిటీ ‘ప్రీ-ఇన్‌స్టాలేషన్’ వివాదం?

సాధారణంగా ఫోన్ కొన్నప్పుడు అందులో ఉండే క్యాలెండర్, కాలిక్యులేటర్ లేదా గడియారం వంటి యాప్‌ల మాదిరిగానే ఆధార్ యాప్‌ను కూడా ఫోన్ తయారీ దశలోనే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. 134 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) ఆధారిత సేవలను సులభతరం చేయడం దీని లక్ష్యం. ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకింగ్, టెలికాం, ఇతర ప్రభుత్వ సేవలకు డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావించారు. అయితే, వినియోగదారుల గోప్యత, ఫోన్ సాఫ్ట్‌వేర్ పనితీరుపై ఇది ప్రభావం చూపుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి.

సంచార్ సాథీ అనుభవంతో వెనక్కి..

గతంలో సంచార్ సాథీ (మోసాలను నివేదించే యాప్)ను 90 రోజుల్లోగా అన్ని మొబైళ్లలో ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా మొబైల్ కంపెనీల నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. భద్రతా పరమైన అంశాలు, వినియోగదారుల ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదన బలంగా వినిపించడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యం మంచిదే అయినప్పటికీ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల గ్లోబల్ పాలసీలు, వినియోగదారుల డేటా సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినది.

ఇదీ చదవండి: గోల్డ్‌ ధర.. గుండె దడ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement