దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పౌరుల జీవన ప్రమాణాలను, ప్రభుత్వ సేవలను సమూలంగా మార్చేస్తోంది. సాధారణ యుటిలిటీ బిల్లులకే పరిమితం కాకుండా, విస్తృత శ్రేణి ప్రభుత్వ సర్వీసులను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడంలో భారతదేశం ప్రగతి సాధిస్తోంది. దేశవ్యాప్తంగా మొబైల్ యాప్‌ల ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘భారత్ కనెక్ట్’ ఈ డిజిటల్ చెల్లింపుల పరివర్తనకు కేంద్ర బిందువుగా నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.
భారత్ కనెక్ట్ (గతంలో భారత్ బిల్ పే - బీబీపీఎస్) వివిధ బిల్లుల చెల్లింపులను, ఆర్థిక లావాదేవీ మార్గాలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడం ద్వారా పౌరులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా భారత్ కనెక్ట్ ఆధారిత యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా కింది సేవలను క్షణాల్లో అందుతున్నాయని పేర్కొంది.
విద్యుత్ బిల్లులు
మున్సిపల్, నీటి పన్నులు
ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌లు
ఈ-చలాన్లు
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)
ఇది భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన కస్టమర్-టు-గవర్నమెంట్ (సీ2జీ) డిజిటల్ సర్వీసుగా నిలిచింది. ప్రస్తుతం భారత్ కనెక్ట్ నెట్‌వర్క్‌లో 29 కంటే ఎక్కువ విభాగాల్లో 22,000 పైగా బిల్లుదారులు భాగస్వాములుగా ఉన్నారు. అలాగే 700 కంటే ఎక్కువ యాప్‌ల ద్వారా ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
డిజిటల్ భరోసా
ఈ మార్పు కేవలం చెల్లింపుల వేగానికి సంబంధించింది మాత్రమే కాదని, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేదని ఎన్‌పీసీఐ భారత్ బిల్‌పే లిమిటెడ్ (ఎన్‌బీబీఎల్) ఎండీ, సీఈఓ నూపుర్ చతుర్వేది పేర్కొన్నారు. ‘శ్రమతో కూడిన ప్రక్రియల స్థానంలో సులభతరమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ ద్వారా అన్ని సేవలు పారదర్శకంగా ఉన్నాయి. భారీ స్థాయిలో డిజిటల్ అడాప్షన్‌ను కొనసాగించడానికి ఈ నమ్మకమే అత్యంత కీలకం’ అని చతుర్వేది అన్నారు.
హైబ్రిడ్ మోడల్
భారత్ కనెక్ట్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతోపాటు అందరికీ కలుపుకొనిపోయే సాంకేతిక నిర్మాణాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది ఆఫ్ లైన్ ఏజెంట్ల ద్వారా డిజిటల్ పరిజ్ఞానం లేని వారికి కూడా ఈ సేవలను అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు తమ సమీపంలోని ఏజెంట్ వద్దకు వెళ్లి నగదు రూపంలో ప్రభుత్వ బాకీలను సులభంగా చెల్లించవచ్చు. ఈ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ విభజనను సమర్థవంతంగా తొలగిస్తోంది.
ఈ వ్యవస్థీకృత ప్రక్రియ ద్వారా ప్రజలు తమ ఖర్చులను ట్రాక్ చేసుకోవడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లిస్తూ క్రమశిక్షణ అలవాటు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.‘ప్రభుత్వ విభాగాలకు సైతం ఇది ఎంతో మేలు చేస్తోంది. దీనివల్ల రాబడుల సేకరణ మెరుగైంది. చెల్లింపుల్లో జాప్యం తగ్గింది. వ్యవస్థలో పారదర్శకత పెరిగి పౌరులకు, ప్రభుత్వ సంస్థలకు మధ్య నమ్మకం బలపడింది’ అని తెలిపారు.
ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు


