
శరవేగంగా పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య, అధికమవుతున్న చిన్న కుటుంబాలు.. వెరసి ప్రపంచ వినియోగ రాజధానిగా భారత్ అవతరించనుందని ఏంజిల్ వన్ నివేదిక వెల్లడించింది. 2034 నాటికి దేశంలో వినియోగం రెట్టింపు అవుతుందని.. ప్రధాన ఆర్థిక వ్యవస్థలను భారత్ అధిగమిస్తుందని అంచనా వేసింది. వినియోగానికి జనరేషన్ జెడ్ ఆజ్యం పోయనుందని.. అదే సమయంలో పొదుపులు కూడా దూసుకెళ్లనున్నాయని వెల్లడించింది. అంటే కావాల్సిన వస్తుసేవల కోసం పొదుపు చేసుకున్న సొమ్మునే విరివిగా వెచ్చించనున్నారని తెలిపింది. దేశంలో వినియోగం స్థూల దేశీయ ఉత్పత్తిలో (జీడీపీ) 56 శాతం వాటా కలిగి ఉందని పేర్కొంది. ఏంజెల్ వన్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..
అనవసరపు ఖర్చుల పెరుగుదల వైపు..
ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో పన్ను ఊరట కారణంగా ప్రజల చేతుల్లోకి రూ.లక్ష కోట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని అంచనా. దీంతో వినియోగం రూ.3.3 లక్షల కోట్లు పెరుగుతుందని.. ఇది దేశ జీడీపీని 1% పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, చైనాలో అనవసర ఖర్చులు అవసరాలను అధిగమించాయి. సగటు ఆదాయం పెరగనుండటంతో భారతదేశంలోనూ ఆ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అమెరికాలో గతంలో తలసరి ఆదాయం బాగా పెరిగిన సమయంలో.. వినియోగ వ్యయం 10 రెట్లు పెరగడం గమనార్హం. తలసరి ఆదాయం పెరిగే కొద్దీ భారత వినియోగంలో కూడా ఇదే విధమైన వృద్ధిని చూడవచ్చని ఏంజెల్ వన్ నివేదిక పేర్కొంది.
జెనరేషన్ జెడ్ తరంతో..
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఉపకరణాలు (ఆభరణాలు సహా), ఎక్స్‌పీరియెన్స్ కోసం వినియోగదారులు అధికంగా ఖర్చు చేయనున్నారని నివేదిక పేర్కొంది. దేశంలో ఇప్పటికీ 92శాతం రిటైల్ వ్యాపారం కిరాణా దుకాణాల ద్వారానే జరుగుతోందని... మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఆధునిక రిటైల్‌కు భారీ అవకాశం ఉందని తెలిపింది. యూఎస్ మొత్తం జనాభాను మించి భారత్‌లో జనరేషన్ జెడ్ తరం (1996–2012 మధ్య పుట్టినవారు) ఉంది. 2035 నాటికి భారత్‌లో చేసే ఖర్చులో సగం జనరేషన్ జెడ్ తరం నుంచే ఉంటుందని.. భారత వినియోగ వృద్ధి పథానికి ఇది తోడ్పడుతుందని నివేదిక తెలిపింది.
ఇదీ చదవండి: ‘ఆర్థిక సేవలకు నియంత్రణలు అడ్డు కారాదు’
103 ట్రిలియన్ డాలర్లకు..
మన దేశంలో చిన్న కుటుంబ ధోరణుల కారణంగా.. జనాభా పెరుగుదల కంటే ఇళ్ల సంఖ్యలో వృద్ధి ఎక్కు వగా ఉంటోంది. ఇది అధిక వినియోగానికి కీలక చోదకంగా మారుతోంది. ప్రపంచ శ్రామిక శక్తి వృద్ధిలో కూడా భారత్ ముందుండబోతోంది. రాబో యే 25 ఏళ్లలో భారత్‌లో పొదుపులు (సేవింగ్స్) గత 25 సంవత్సరాల మొత్తం పొదుపు కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. 1997 నుంచి 2023ఆర్థిక సంవత్సరం మధ్య దేశంలో మొత్తం సేవింగ్స్ 12 ట్రిలియన్ డాలర్లు (రూ.10,32,00,000 కోట్లు) అయితే.. 2047 నాటికి 103 ట్రిలియన్ డాలర్లకు (రూ.88,58,00,000 కోట్లు) చేరుకుంటాయని అంచనా. వినియోగం భారీ స్థాయిలో పెరిగేందుకు ఇది దోహదం చేయనుంది.