తెలంగాణలో మల్టీగిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం

Hyderabad: Allox To Set Up India First Multi Gigawatt C Flp Manufacturing Unit In Ts - Sakshi

750 కోట్ల రూపాయల పెట్టుబడి

తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్

600 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు

ప్రతిపాదిత కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీల ఉత్పత్తి

సాక్షి, హైదరాబాద్‌: మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటుకానుంది. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఈ తయారీ కేంద్రంలో ఉత్పత్తి అవుతాయి. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అలాక్స్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తొలుత 210 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగా వాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని అలాక్స్ తెలిపింది.

ఈ సామర్థ్యాన్ని భవిష్యత్తులో పది గిగావాట్లకు పెంచుతామన్నారు. 2030 సంవత్సరం నాటికి మొత్తంగా 750 కోట్ల రూపాయలను ఈ కేంద్రం పై పెట్టుబడిగా పెట్టనున్నారు. ప్రతిపాదిత తయారీ కేంద్రంతో సుమారు 600 మంది అత్యుత్తమ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అలాక్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు రాష్ట్రంలో తయారీ ఈకో సిస్టం ను పెంచేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్ తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ -అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ కీలకంగా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2020 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్, ఈ ఎస్ ఎస్ పాలసీని తీసుకొచ్చిందన్న కేటీఆర్, ఇలాంటి ప్రత్యేక పాలసీని దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ప్రభుత్వం తమదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణమేనని అలాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య సుంకవల్లి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహన రంగంతో పాటు ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో కీలకంగా మారేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తోందన్నారు.  ఈ కార్యక్రమంలో ఐటీ,పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, ఈవీ సెక్టార్ డైరెక్టర్ ఆటోమోటివ్ గోపాలకృష్ణన్ విసి పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top