
కొత్త సినిమా వార్2తో అలరిస్తున్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటనలోనే కాదు వ్యాపారంలోనూ దూసుకుపోతున్నారు. ఆస్తులు కూడబెట్టడంలో, వాటి విలువను పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల ముంబయిలోని ఓ ఆస్తిని కొనుగోలు చేయడంతో అందుకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
హృతిక్ రోషన్ తన తండ్రి రాకేష్ రోషన్ స్థాపించిన హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్‌పీ కంపెనీ కోసం ముంబైలోని చండీవాలి ప్రాంతంలో మూడు కార్యాలయ యూనిట్లను రూ.31 కోట్లకు కొనుగోలు చేశారు. అంధేరీ ఈస్ట్‌లోని చండీవలి ప్రాంతంలోని బూమరాంగ్ పేరుతో ఉన్న భవనం మొదటి అంతస్తులోని ఈ మూడు కార్యాలయాలు 13,546 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దీనికి సంబంధించి 2025 జులై 9న కొనుగోలు జరిగిందని డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తుంది.
ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఈ లావాదేవీలో స్టాంప్ డ్యూటీ రూ.1.86 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30 వేలుగా ఉంది. ఈ లావాదేవీలో అమ్మకందారులుగా మనీష్ కృష్ణం గోపాల్ బజారీ, షాలిని మనీష్ బజారీ, బాజ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ భవనంలో రోషన్ కుటుంబం పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2024లో హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్‌పీ ఐదో అంతస్తులోని ఐదు కార్యాలయ యూనిట్లను రూ.37.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందులో 17,389 చదరపు అడుగుల స్థలం ఉంది.
ఇదీ చదవండి: భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఇంతకు ముందు రోషన్ కుటుంబం రూ.6.75 కోట్లకు అంధేరీలో మూడు అపార్ట్ మెంట్లను విక్రయించింది. అంధేరీ వెస్ట్‌లోని విజయ్ నివాస్ సీహెచ్‌ఎస్ లిమిటెడ్ భవనంలో 1,025 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రాకేష్ రోషన్ విక్రయించారు. ఈ ఆస్తితో పాటు రెండు పార్కింగ్ స్థలాలను సోనాలి అజ్మీరాకు రూ.3.75 కోట్లకు విక్రయించారు. మే 25న జరిగిన ఈ లావాదేవీలో రూ.18.75 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి. మరో లావాదేవీలో రాకేష్ రోషన్ అంధేరి వెస్ట్‌లోని రహేజా క్లాసిక్ భవనంలోని 625 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను జీవన్ భావనానీ, శిల్పా వాధ్వానీ, గౌరవ్ వాధ్వానీ అనే ముగ్గురు వ్యక్తులకు రూ.2.20 కోట్లకు విక్రయించారు. ఈ లావాదేవీ మే 17న నమోదు కాగా, స్టాంప్ డ్యూటీ రూ.13.20 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.30 వేలు చెల్లించారు.