
క్యూ4లో రూ.1,169 కోట్లు
షేరుకి రూ.65 డివిడెండ్
ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24 శాతం జంప్‌చేసి రూ. 1,169 కోట్లను తాకింది. వ్యయ నియంత్రణ, విభిన్న ప్రొడక్టులు, మెరుగుపడిన మార్జిన్లు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 943 కోట్లు మాత్రమే ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 65 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 9,794 కోట్ల నుంచి రూ. 10,244 కోట్లకు బలపడింది. అయితే మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల మొత్తం విక్రయాలు 13.92 లక్షల నుంచి 13.81 లక్షల యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి.
ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?
వాహన అమ్మకాలు అప్
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హీరో మోటో నికర లాభం 17 శాతం ఎగసి రూ. 4,376 కోట్లకు చేరింది. 2023–24లో రూ. 3,742 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 38,643 కోట్ల నుంచి రూ. 41,967 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 5 శాతం అధికంగా 58.99 లక్షల వాహనాలు విక్రయించింది. 2023–24లో 56.21 లక్షల వాహన అమ్మకాలు నమోదయ్యాయి. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నికర లాభాలు ఆర్జించినట్లు హీరో మోటో ఈడీ, తాత్కాలిక సీఈవో విక్రమ్ ఎస్ కస్బేకర్ పేర్కొన్నారు. వరుసగా 24వ ఏడాదిలోనూ మార్కెట్ లీడర్‌గా కంపెనీ కొనసాగినట్లు తెలియజేశారు. కీలకమైన 125 సీసీ విభాగంలో కన్సాలిడేషన్ జరుగుతున్నదని, భవిష్యత్‌లో ఈవీల విడుదల ద్వారా వృద్ధి కొనసాగనున్నట్లు వివరించారు.