జీఎస్‌టీ వసూళ్ల రికార్డ్‌.. ఒక్క నెలలో రూ.2.43 లక్షల కోట్లు | gst collections hit record high in april 2026 | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ వసూళ్ల రికార్డ్‌.. ఒక్క నెలలో రూ.2.43 లక్షల కోట్లు

May 2 2026 12:13 PM | Updated on May 2 2026 12:50 PM

gst collections hit record high in april 2026

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ద్వారా ఏప్రిల్‌ నెలలో రూ.2.43 లక్షల కోట్ల స్థూల ఆదాయం వసూలైంది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూళ్లు రూ.2.23 లక్షల కోట్లతో పోల్చిచూస్తే 8.7 శాతం పెరుగుదల నమోదైంది. ఇది ఒక నెలలో అత్యధిక వసూళ్ల రికార్డు. దేశీ విక్రయాలపై జీఎస్‌టీతో పోల్చి చూస్తే, దిగుమతులపై పన్ను ఆదాయమే ఎక్కువ వృద్ధి చూపించడం గమనార్హం.  

  • దేశీ విక్రయాలపై జీఎస్‌టీ 4.3 శాతం పెరిగి రూ.1.85 లక్షల కోట్లకు చేరింది.

  • దిగుమతులపై జీఎస్‌టీ 25.8 శాతం పెరిగి రూ.57,580 కోట్లు వసూలైంది.

  • సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రూ.52,140 కోట్లు రాగా, స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.61,331 కోట్లుగా ఉంది.

  • ఐజీఎస్‌టీ  రూ.1.29 లక్షల కోట్లు వసూలైంది.

  • రిఫండ్‌లు (పన్ను చెల్లింపుదారులకు వాపసు) 19.3 శాతం పెరిగి రూ.31,793 కోట్లకు చేరాయి.

  • రిఫండ్‌లు సర్దుబాటు అనంతరం నికర జీఎస్‌టీ వసూళ్లు ఏప్రిల్‌లో రూ.2.11 లక్షల కోటు.

  • ఈ ఏడాది మార్చి నెలకు స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.2,00,064 కోట్లుగా ఉండడం గమనార్హం.

7–8 శాతం వృద్ధి సాధారణమే
జీఎస్‌టీ 2.0 అనంతరం ప్రతి నెలా పన్నుల ఆదాయం 7–8 శాతం మేర వృద్ధి చెందడం సాధారణంగా మారినట్టు ప్రైస్‌ వాటర్‌హౌస్‌ అండ్‌ కో ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్‌ ప్రతీక్‌జైన్‌ పేర్కొన్నారు. ఇది బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్టు చెప్పారు. దిగుమతులపై ఆదాయం దేశీ లావాదేవీలను మించడం అన్నది దేశీ వినియోగం కొంత నిదానించడాన్ని తెలియజేస్తోందని జైన్‌ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement