 
													స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘గ్రో’ (Groww IPO) మాతృ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్, పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 6,632 కోట్లు సమీకరించనుంది. నవంబర్ 4న ఇష్యూ ప్రారంభమై 7న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నవంబర్ 3 బిడ్డింగ్ తేదీగా ఉంటుంది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 95–100గా ఉంటుంది. రూ. 61,700 కోట్ల (సుమారు 7 బిలియన్ డాలర్లు) వేల్యుయేషన్‌ను కంపెనీ అంచనా వేస్తోంది.
ఐపీవోలో భాగంగా రూ. 1,060 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుుండగా, ప్రమోటర్లు..ఇన్వెస్టర్ షేర్‌హోల్డర్లు 55.72 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనున్నారు. ప్రమోటర్లలో లలిత్ కేష్రి, హర్ష్ జైన్ మొదలైన వారు ఉన్నారు. వ్యవస్థాపకులకు కంపెనీలో 27.97 శాతం వాటా ఉంది.
ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను టెక్నాలజీ, వ్యాపార విస్తరణకు కంపెనీ వినియోగించుకోనుంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, మరింతమంది కస్టమర్లను ఆకర్షించేలా టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయడం, మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి కొనసాగిస్తామని గ్రో సహ–వ్యవస్థాపకుడు హర్ష్ జైన్ తెలిపారు.
2016లో ఏర్పాటైన గ్రో.. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. 2025 జూన్ నాటికి 1.26 కోట్ల మంది యాక్టివ్ క్లయింట్లు, 26 శాతం పైగా మార్కెట్ వాటా ఉంది. ఇటీవలే వెల్త్ మేనేజ్‌మెంట్, కమోడిటీస్ మొదలైన విభాగాల్లోకి విస్తరించింది. ఈ ఏడాది మే నెలలో మార్కెట్ల నియంత్రణ సెబీకి కాన్ఫిడెన్షియల్ విధానంలో ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో గ్రో లాభం మూడు రెట్లు పెరిగి రూ. 1,824 కోట్లకు చేరింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
