తప్పుడు ప్రకటనలపై గూగుల్‌ కీలక నిర్ణయం

Google Stops Serving Ads on Climate Change Misinformation - Sakshi

లండన్‌: వాతావరణ మార్పుపై తప్పుడు సమాచారం అందించే ప్రకటనలను తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రోత్సహించకూడదని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ గూగుల్‌ నిర్ణయించింది. తన ప్లాట్‌ఫామ్స్‌పై శీతోష్ణస్థితి మార్పుపై తప్పుడు సమాచారం వ్యాపించకుండా నిరోధించడం, అలాంటి సమాచారాన్ని ఇతరులు ఆర్జనకు ఉపయోగించుకోకుండా నిలిపివేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు కూడా తాజా నిర్ణయం వర్తింస్తుందని కంపెనీ వెల్లడించింది.

శాస్త్రీయాధా రితం కాని శీతోష్ణస్థితి మార్పు సమాచారాన్ని ఇతర ప్రకటనకర్తలు తమ ప్రకటనల పక్కన కనిపించాలని కోరుకోరని తెలిపింది. శీతోష్ణస్థితి మార్పు అనేది లేదని చెపుతూ సొమ్ము చేసుకునే వీడియోలను యూట్యూబ్‌లో ఉంచమని పేర్కొంది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పు లేదా గ్రీన్‌హౌస్‌ వాయువుల వల్ల ప్రమాదం అనేవి నిజాలు కావని కొందరు ప్రచారం ఆరంభించిన సంగతి తెలిసిందే! వీరు తమ వాదనలకు అనుకూలంగా వీడియోలను, ప్రకటనలను రూపొందిస్తున్నారు.

ఇలాంటివాటిని నిరోధిం చాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ మార్పు అమలుకు కంపెనీ ఆటోమేటెడ్‌ టూల్స్‌ను ఉపయో గించనుంది. పర్యావరణ హితకారులైన కొన్ని విధానాలను ఇటీవల గూగుల్‌ ప్రవేశపెట్టింది. అయితే తాజా మార్పులను కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒక సమాచారం సరైనదా? కాదా? ఎలా గూగుల్‌ నిర్ణయిస్తుందని వాతావరణ పరిశోధకురాలు లీసా షిప్పర్‌ ప్రశ్నించారు. ఈ విషయంలో కంపెనీ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు కోరుతున్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top