5-10 ఏళ్లలో ప్రమాదంలో ఉద్యోగాలు | Google DeepMind CEO warned AI will disrupt jobs in next ten years | Sakshi
Sakshi News home page

5-10 ఏళ్లలో ప్రమాదంలో ఉద్యోగాలు

May 26 2025 11:33 AM | Updated on May 26 2025 12:04 PM

Google DeepMind CEO warned AI will disrupt jobs in next ten years

వచ్చే ఐదు నుంచి పదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  టెక్‌ ఉద్యోగాలకు ప్రమాదంగా పరిణమిస్తుందని గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ హెచ్చరించారు. ఓ పాడ్‌కాస్ట్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ టెక్‌ పరిశ్రమలను పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉందన్నారు. తాత్కాలికంగా సాంప్రదాయ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని, కొత్త, మరింత విలువైన ఉద్యోగాలను సృష్టిస్తుందని హస్సాబిస్ నొక్కి చెప్పారు.

జాబ్ మార్కెట్‌పై ఏఐ ప్రభావం

మిలీనియల్స్‌(1981-1996 మధ్య జన్మించినవారు) కెరియర్‌ ప్రారంభదశలో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందని, జెన్ జెడ్‌(1997 నుండి 2012 మధ్య జన్మించినవారు)కు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, జెన్ ఆల్ఫా(2013-24 మధ్య జన్మించినవారు)కు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతున్నప్పటికీ, కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన నమ్ముతున్నారు. మారుతున్న టెక్నాలజీ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్తులో స్థిరపడాలంటే స్టెమ్(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) ఎడ్యుకేషన్‌ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ముఖ్యంగా యువత కోడింగ్‌పై దృష్టి పెట్టాలని, అదే సమయంలో సృజనాత్మకతకు పెద్దపీట వేయాలని విద్యార్థులకు సూచించారు.

ఇదీ చదవండి: యాపిల్ ఐఫోన్ 17 లాంచ్‌ డేట్‌ ఫిక్స్‌?

గూగుల్ డీప్ మైండ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అభివృద్ధి చేయడానికి అతి చేరువలో ఉందని హస్సాబిస్ వెల్లడించారు. ఇది మానవ స్థాయి తార్కిక సామర్థ్యం కలిగిన కృత్రిమ మేధ అని తెలిపారు. ఏఐ అభివృద్ధి చెందుతున్నప్పుడు శ్రామిక శక్తిలో పోటీగా ఉండటానికి టెక్నాలజీలను అర్థం చేసుకోవడం, వాటిని సమర్థంగా ఉపయోగించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement