ప్రపంచం వృద్ధి బాట పట్టే దాకా ఇదే ధోరణి

Gold Rates Will Be Raising Until World Reach Growth Rate - Sakshi

ఆభరణాల డిమాండ్‌ 40 శాతం పడిపోతే... రిటైల్‌ పెట్టుబడులు 15% అప్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధి బాట పట్టే వరకూ పెట్టుబడిదారులకు బంగారం ఒక సురక్షిత సాధనంగా కొనసాగే అవకాశం ఉంటుందని ప్రముఖ మార్కెట్‌ డేటా విశ్లేషణా సంస్థ రిఫినిటివ్‌ అంచనావేస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో పసిడికి  డిమాండ్‌ కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఆభరణాలకు డిమాండ్‌ 40 శాతం పడిపోవచ్చని విశ్లేషించిన సంస్థ సీనియర్‌ విశ్లేషకులు, అదే సమయంలో పెట్టుబడులకు సంబంధించి డిమాండ్‌ 15 శాతం పెరుగుతుందని అంచనావేస్తున్నారు. ఒక వెబినార్‌లో మంగళవారం వారు ఈ అంశాలను వివరించారు. కీలక అంశాలను పరిశీలిస్తే...  

పసిడి కదలికలు ఇలా... 
కరోనా తీవ్రత నేపథ్యంలో  అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో– నైమెక్స్‌లో పసిడి ఔ¯Œ్స (31.1గ్రాములు) ధర జూలై 27వ తేదీన తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్‌ చేసింది. అటు తర్వాత వారంరోజుల్లోనే చరిత్రాత్మక స్థాయి  2,089  డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ ధరల వద్ద లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. ఈ వార్త రాసే రాత్రి 12 గంటలకు కీలక మద్దతు స్థాయి 1,900 డాలర్లకు ఎగువన 1,902 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపుతో పోల్చితే ఇది 20 డాలర్లు అధికం.  దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర మంగళవారం ఈ వార్త రాసే సమయానికి రూ.550 లాభంతో రూ. 50,680 వద్ద ట్రేవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరినప్పడు ఈ ధర ఇక్కడ రూ.54,000 వరకూ వెళ్లింది.

ఉద్దీపన చర్యల తోడ్పాటు
కోవిడ్‌–19ను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఆర్థిక ఉద్దీపన చర్యలను చేపట్టాయి. దీనితోపాటు వృద్ధికి తోడ్పాటును అందించే క్రమంలో వడ్డీరేట్లు అతి తక్కువ స్థాయిలో కొనసాగించడానికీ మొగ్గుచూపుతున్నాయి. పసిడి డిమాండ్‌ పెరుగుదలకు ఆయా అంశాలు దోహదం చేస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పసిడికి డిమాండ్‌ను గరిష్ట స్థాయిలకు తీసుకువెళుతుంది.  ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఉద్దీపన చర్యలకు సంబంధించిన నిధులను పసిడిని ఆకర్షికంచే అవకాశం ఉంది. – దేబజిత్‌ సాహా, రిఫినిటివ్‌ సీనియర్‌ మెటల్స్‌ విశ్లేషకులు
 
ఫిజికల్‌ డిమాండ్‌ ఉండదు
బంగారం సరఫరా ఈ ఏడాది 3 శాతం పెరిగింది. దీనికి స్క్రాప్‌ సరఫరాల్లో పెరుగుదలా ఒక కారణం. దీనితో గనుల నుంచి సరఫరాలు కొంత తగ్గాయి. కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న  నేపథ్యంలో పసిడికి ఫిజికల్‌ డిమాండ్‌ ఉండకపోవచ్చు. ఇటీవల తగ్గిన ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) డిమాండ్, మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. 2020 చివరికి ఈ డిమాండ్‌ వెయ్యి టన్నులు దాటే అవకాశం ఉంది. – క్యామెరాన్‌  అలెగ్జాండర్, రిఫినిటివ్‌ ప్రెషియస్‌ మెటల్స్‌ రీసెర్చ్‌ హెడ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top