
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పటిష్టంగా ఉండటం, టారిఫ్‌లపరమైన అనిశ్చితి, ఈ నెలలో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య పసిడి ర్యాలీ కొనసాగుతోంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం సోమవారం దేశీయంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ. 1,000 పెరిగి మరో కొత్త రికార్డు స్థాయి రూ. 1,05,670ని తాకింది.
99.5 శాతం స్వచ్ఛత బంగారం రూ. 800 పెరిగి రూ. 1,04,800కి చేరింది. అమెరికా టారిఫ్‌లపరమైన అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఫెడ్ వైఖరి గురించి ఆందోళన పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు, పసిడిలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారని ట్రేడర్లు వెల్లడించారు. రూపాయి మారకం క్షీణిస్తుండటం, భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పుత్తడి ఆకర్షణీయత మరింత పెరిగిందని ట్రేడ్‌జీని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డి. త్రివేశ్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ రిజర్వ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, టారిఫ్‌లపరమైన అనిశ్చితి, ఈ నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మొదలైన అంశాలు స్పాట్ మార్కెట్లో పసిడి ర్యాలీకి కారణమవుతున్నాయని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కాయ్‌నాత్ చైన్‌వాలా చెప్పారు.
ఇదీ చదవండి: వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!
అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) పసిడి రేటు ఒక దశలో 3,556.87 డాలర్లకు ఎగిసింది. ఇది కొత్త ఆల్‌టైమ్ రికార్డు స్థాయి కావడం గమనార్హం. మరోవైపు, వెండి ధర కేజీకి మరో రూ. 1,000 పెరిగి ఇంకో కొత్త గరిష్ట స్థాయి రూ. 1,26,000ని తాకింది. పర్యావరణహిత విద్యుత్, ఎల్రక్టానిక్స్ తదితర పరిశ్రమల నుంచి డిమాండ్‌తో పాటు స్పెక్యులేషన్ కూడా వెండి ర్యాలీకి దోహదపడుతోందని త్రివేశ్ వివరించారు.