బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి | Gold Investment Demand Surges In India, Share May Reach 40% As Prices Rally | Sakshi
Sakshi News home page

బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి

Apr 28 2026 7:51 AM | Updated on Apr 28 2026 9:47 AM

Gold as an Asset Not Just an Ornament Investors Shift Focus from Jewellery to Bullion

పసిడి కొనుగోళ్లలో ఆభరణాల వినియోగమే పెద్ద మొత్తంలో ఉంటోంది. కానీ, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో బాగా ర్యాలీ చేయడం తెలిసిందే. దీంతో వినియోగం కంటే పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశంలో మొత్తం బంగారం కొనుగోళ్లలో పెట్టుబడుల వాటా 40 శాతానికి చేరుకుంటుందని రేటింగ్‌ సంస్థ కేర్‌ఎడ్జ్‌ అంచనా వేసింది. ఇక ఆభరణాల వినియోగం వాటా 60 శాతం లోపునకు దిగొస్తుందని పేర్కొంది. మన దేశంలో బంగారం కొనుగోళ్లలో దీర్ఘకాలం నుంచి ఆభరణాల వాటా 70 శాతంగా ఉంటుంటే, మిగిలిన 30 శాతం పెట్టుబడుల నుంచి ఉంటోంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ఆభరణాల వాటా పసిడి కొనుగోళ్లలో 50 శాతమే కావడం గమనార్హం.  

నిర్మాణాత్మక మార్పు.. 
దేశంలో బంగారం కొనుగోళ్లలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు ఇది నిదర్శనమని కేర్‌ఎడ్జ్‌ డైరెక్టర్‌ అఖిల్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా, భారత్‌ కలసి సగం వాటా కలిగి ఉండడం విశేషం. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బంగారం ధరల్లో కదలికలు, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం అన్నవి పసిడిపై పెట్టుబడుల డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయి. 2026–27లో మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడి వాటా 35–40 శాతానికి చేరుతుంది. ఇక 60 శాతం ఆభరణాల వాటా అన్నది ప్రపంచ సగటు 50 శాతం కంటే ఎక్కువే’’అని అఖిల్‌ గోయల్‌ తెలిపారు.  

గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు ఆదరణ.. 
పెట్టుబడుల్లో అధిక శాతం గోల్డ్‌ ఈటీఎఫ్‌ల రూపంలో ఉంటున్నట్టు కేర్‌ఎడ్జ్‌ నివేదిక తెలిపింది. ఒక్క గోల్డ్‌ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లే 37.5 టన్నులు ఉంటాయని.. గత పదేళ్లలో మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఆ తర్వాత బంగారం కాయిన్లు, కడ్డీల రూపంలోఉంటోంది. స్వల్పకాల స్పెక్యులేటివ్‌ అవసరాలు కాకుండా.. డిమాండ్‌ ధోరణుల్లో నిర్మాణాత్మక మార్పుల నేపథ్యంలో బంగారం అధిక ధరల శ్రేణిలో కొనసాగనున్నట్టు కేర్‌ఎడ్జ్‌ తెలిపింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ 2025లో ఆభరణాల వినియోగం బలంగా ఉందని, 10 శాతం పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఆభరణాల కొనుగోళ్ల విలువ మాత్రం 15 శాతం తగ్గడం గమనార్హం. 2026లో ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉండొచ్చని కేర్‌ఎడ్జ్‌ అంచనా వేసింది.

‘‘సంస్థాగత జ్యుయలరీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి ఆభరాణాలకు డిమాండ్‌ స్థిరంగా ఉంటోంది. కంపెనీల స్థూల మార్జిన్లు 170–200 బేసిస్‌ పాయింట్లు పెరుగుతాయని అంచనా. 2026–27లో స్థూల మార్జిన్లు 14–14.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఎబిట్డా మార్జిన్లు 6.5–7 శాతం మేర ఉండొచ్చు’’అని తెలిపింది. వెండికి యువతరం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి పెరుగుతున్నప్పటికీ సమీప కాలంలో బంగారాన్ని అది భర్తీ చేయలేదని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement