
న్యూఢిల్లీ: పుత్తడి నాన్‌స్టాప్‌గా పరుగులు తీస్తోంది. గడిచిన ఏడు రోజుల్లో 10 గ్రాములకు దేశీయంగా రూ.7,000 లాభపడింది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం మరో రూ.1,000 పెరిగి రూ.1,07,070 వద్ద ముగిసింది. పసిడికి దేశీయంగా ఇది నూతన జీవిత కాల గరిష్ట స్థాయి. ఈ నెల 25న పసిడి ధర రూ.1,00,170 వద్ద ఉండడం గమనార్హం. ఇక 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,000 పెరిగి రూ.1,06,200 స్థాయిని తాకింది.
మరోవైపు వెండి ధర పెద్దగా మార్పు లేకుండా రూ.1,26,100 స్థాయిలో ట్రేడయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 21 డాలర్లకు పైనే పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి అయిన 3,618.50 డాలర్లకు చేరుకుంది. ‘‘యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు బంగారం ధరల ర్యాలీకి మద్దతునిచ్చాయి.
ఈ వారం చివర్లో ఓపెక్ ప్లస్ కూటమి సమావేశం జరగనుంది. ఇటీవలి ఉక్రెయిన్ దాడితో రష్యా ఆయిల్ ప్రాసెసింగ్ సామర్థ్యం 17 శాతం ప్రభావితం కావడంతో సరఫరా పరమైన ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ఇటీవలి కనిష్టాల నుంచి చమురు ధరలు సైతం పుంజుకున్నాయి’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా వివరించారు. ఫెడ్ రేటు కోతల అంచనాలకు తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానాలు పసిడి ధరలను నడిపిస్తున్నట్టు వెంచురా కమోడిటీ హెడ్ ఎన్‌ఎస్ రామస్వామి సైతం అభిప్రాయపడ్డారు.