పసిడి- వెండి కన్సాలిడేషన్‌లో..

Gold and Silver prices in consolidation mode - Sakshi

రూ. 50,922 వద్ద కదులుతున్న 10 గ్రాముల బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 61,895 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,895 డాలర్లకు

24.10 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో బంగారం, వెండి ధరలు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. రెండు రోజులపాటు ర్యాలీ చేసిన ధరలు ప్రస్తుతం అక్కడక్కడే అన్నట్లుగా కదులుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 94 సమీపంలో ట్రేడవుతోంది. సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్‌ దేశాలలో కోవిడ్‌-19 కేసులు ఉధృతంకావడంతో మళ్లీ లాక్‌డవున్‌ల విధింపుతోపాటు.. కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న విషయం విదితమే. దీంతో ఇన్వెస్టర్లలో ఇటీవల ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు తలెత్తినట్లు నిపుణులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..

నేలచూపులతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం  రూ. 145 తగ్గి రూ. 50,922 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో 50,992 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 50,910 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 112 క్షీణించి రూ. 61,895 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 62,006 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,857 వరకూ క్షీణించింది.

కామెక్స్‌లో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో వరుసగా రెండు రోజులపాటు లాభపడిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.12 శాతం బలపడి 1,895 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లో యథాతథంగా 1,894 డాలర్లకు చేరింది. వెండి 0.3 శాతం పుంజుకుని ఔన్స్ 24.10 డాలర్ల వద్ద కదులుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top