
‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’గా భావించే జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) టెక్నాలజీ పెరుగుదల కంపెనీలను గతంలో కంటే ఎక్కువ లాభదాయకంగా మారుస్తుందని, కానీ అది ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. నేటి కృత్రిమ మేధ ఆధారిత ఉత్పత్తులకు మూలమైన మెషిన్ లెర్నింగ్ కు పునాదులు వేసిన హింటన్, ఉద్యోగాలు కోల్పోయే కార్మికుల ఖర్చుతో కంపెనీలకు లాభాలు వస్తాయని, నిరుద్యోగం ఖచ్చితంగా విపత్కర స్థాయికి పెరుగుతుందని హెచ్చరించారు.
"వాస్తవానికి ఏమి జరగబోతోందంటే.. ధనవంతులు కార్మికుల స్థానంలో కృత్రిమ మేధను ఉపయోగించబోతున్నారు" అని హింటన్ ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది భారీ నిరుద్యోగాన్ని సృష్టిస్తుందని, కంపెనీలకు లాభాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఇది కొంతమందిని మరింత ధనవంతులను చేస్తుంది.. చాలా మందిని పేదలుగా చేస్తుంది. అది ఏఐ తప్పు కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థది అంటూ వివరించారు.
గత ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న హింటన్ చాలాకాలంగా కృత్రిమ మేధ గురించి, దానిని నియంత్రించకుండా వదిలేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తుందో హెచ్చరిస్తూనే ఉన్నారు. "ఏమి జరుగుతుందో మనకు తెలియడం లేదు. కనీసం ఊహకు కూడా అందడం లేదు. కానీ దాని గురించి చెప్పాల్సిన వాళ్లు మాత్రం మిన్నకుండిపోతున్నారు" అని హింటన్ అన్నారు.
‘మనం చరిత్రలో ఒక దశలో ఉన్నాం, అక్కడ ఏదో అద్భుతం జరుగుతోంది, అది ఆశ్చర్యకరంగా మంచిది కావచ్చు.. చెడ్డది కావచ్చు. మనం ఊహాగానాలు చేయగలం, కానీ పరిస్థితులు అలా ఉండవు’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ తమ భాషను అభివృద్ధి చేసుకోగలిగితే సాంకేతిక పరిజ్ఞానం చేతికి అందకుండా పోతుందని ఆయన గతంలోనే హెచ్చరించారు. కృత్రిమ మేధ భయంకరమైన ఆలోచనలు చేయగలదని ఇప్పటికే నిరూపించిందని, మానవులు ట్రాక్ చేయలేని లేదా అర్థం చేసుకోలేని విధంగా యంత్రాలు చివరికి ఆలోచించగలవని ఊహించలేమని హింటన్ అన్నారు.