సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్‌ నజర్‌! | Global Internet at Risk Iran Threatens Undersea Data Cables West Asia Tensions | Sakshi
Sakshi News home page

సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్‌ నజర్‌!

Mar 28 2026 8:04 AM | Updated on Mar 28 2026 8:47 AM

Global Internet at Risk Iran Threatens Undersea Data Cables West Asia Tensions

ప్రపంచ దేశాలను మరో భారీ సంక్షోభం ముంచెత్తబోతోందా? పశ్చిమ ఆసియాలో ముదిరిన యుద్ధ భయాలు ఇప్పుడు సముద్ర గర్భంలోని ‘డిజిటల్ కేబుళ్ల’ను తెంచేలా కనిపిస్తున్నాయా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సముద్ర గర్భంలోని డేటా కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

ఏమిటీ వివాదం?

ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్ డేటా రవాణాలో దాదాపు 95% నుంచి 97% వరకు సముద్ర గర్భంలో అమర్చిన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం (రెడ్‌ సీ), హార్మూజ్‌ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను అనుసంధానిస్తున్నాయి. ఇరాన్ తాజా హెచ్చరికలతో ఈ కేబుళ్లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు ఈ హెచ్చరికలు?

2026 ఫిబ్రవరి చివర్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా నేతృత్వంలోని దళాలకు గల్ఫ్ దేశాలు ఆశ్రయం కల్పిస్తే ప్రతిచర్యగా ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరించినట్లు సమాచారం. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ‘గ్రే జోన్ వార్‌ఫేర్’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎవరు ప్రభావితమవుతారు?

ఒకవేళ ఇరాన్‌ అనుకున్న పనిచేస్తే ఈ ముప్పు కేవలం ఒక దేశానికో లేదా ప్రాంతానికో పరిమితం కాదు. భారత్ నుంచి అమెరికా, యూరప్‌లకు వెళ్లే డేటా ట్రాఫిక్‌లో దాదాపు మూడో వంతు ఈ మార్గాల ద్వారానే వెళ్తుంది. ఇది ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూఏఈ, సౌదీ అరేబియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌లు, డేటా సెంటర్లు నేరుగా ప్రభావితమవుతాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు ఇప్పటికే తమ కేబుల్ ప్రాజెక్టుల విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ‘2ఆఫ్రికా పర్ల్స్’ వంటి భారీ ప్రాజెక్టుల పనులు ఇప్పటికే నిలిచిపోయాయి.

ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఒకవేళ ఈ కేబుళ్లు తెగిపోతే అది కేవలం ఇంటర్నెట్‌లో అవాంతరం కలగడమే కాకుండా అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లు స్తంభిస్తాయి. క్లౌడ్ సర్వీసులు, వీడియో కాల్స్, అంతర్జాతీయ సమాచార మార్పిడి నిలిచిపోతుంది. యుద్ధ ప్రాతిపదికన వీటిని బాగు చేయడం చాలా కష్టంతో కూడుకుంది. సముద్ర గర్భంలో వీటిని సరిచేయడానికి ప్రత్యేక నౌకలు కావాలి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఆ నౌకలు అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

భారత ప్రభుత్వం అప్రమత్తం

ఈ పరిణామాల నేపథ్యంలో భారత టెలికాం శాఖ ఇప్పటికే అలర్ట్ అయింది. టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్‌టెల్ వంటి సంస్థలతో అత్యవసర సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ‘సముద్ర గర్భంలోని ఈ కేబుళ్లు ఆధునిక ప్రపంచానికి ప్రాణధారలు. వీటిపై దాడి జరిగితే అది కేవలం ఒక భౌగోళిక దాడి కాదు, ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై జరిగే అతిపెద్ద దాడి అవుతుంది. దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ ముప్పును నివారించడం ఒక్కటే ప్రస్తుతానికి మార్గం’ అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement