భారతీయ బ్యాంకింగ్ రంగంలో వరుస కుంభకోణాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల చండీగఢ్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో జరిగిన రూ.590 కోట్ల భారీ మోసం మరవకముందే తాజాగా హరియాణాలోని పంచకుల కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.150 కోట్ల మున్సిపల్ నిధులు మాయమవ్వడం చర్చనీయాంశం అయింది. సామాన్యుడి సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బ్యాంకులు వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరుగుతోంది?
వరుసగా జరుగుతున్న ఈ ఘటనలను పరిశీలిస్తే ఇవి కేవలం సాంకేతిక లోపాలు మాత్రమే కాదని, వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన వైఫల్యాలని అర్థమవుతోంది. ఐడీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంకు ఉదంతాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే.. బ్యాంక్ సిబ్బంది సహకారం లేకుండా ఇంత భారీ స్థాయిలో నిధుల మళ్లింపు సాధ్యం కాదు. ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, నకిలీ స్టేట్‌మెంట్లు ఇవ్వడం వంటివి ఉన్నతాధికారుల కళ్లుగప్పి జరగడం వెనుక బ్యాంక్ లోపలి శక్తుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.
నిఘా వైఫల్యం
ప్రైవేట్ బ్యాంకుల్లో అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థ కేవలం లాభనష్టాల లెక్కలకే పరిమితమవుతోంది. క్షేత్రస్థాయిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ రికార్డుల మధ్య వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు వంటివి) బల్క్ డిపాజిట్లు చేసినప్పుడు బ్యాంకు మేనేజర్లు ఇచ్చే స్టేట్‌మెంట్లను గుడ్డిగా నమ్ముతారు. దీనిని ఆసరాగా చేసుకుని షెల్ కంపెనీలకు నిధులు మళ్లించడం సులభతరమవుతోంది.
వ్యవస్థ ప్రక్షాళనకు కావాల్సిన కఠిన చర్యలు
ఇలాంటి స్కామ్‌లు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం పోలీసు విచారణ సరిపోదు. బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు రావాలి.
ఏడాదికి ఒకసారి జరిగే ఆడిటింగ్ కాకుండా ప్రతి నెలా ప్రభుత్వ నిధులపై థర్డ్-పార్టీ స్వతంత్ర ఆడిట్ జరగాలి.
కస్టమర్లు తమ ఎఫ్‌డీ స్టేటస్‌ను బ్యాంక్ పంపే కాగితాల ద్వారా కాకుండా నేరుగా సెంట్రల్ సర్వర్ ద్వారా చెక్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ లేదా ప్రత్యేక పోర్టల్ ఉండాలి.
భారీ స్కామ్ జరిగినప్పుడు కేవలం కింది స్థాయి క్లర్కులను మాత్రమే కాకుండా సంబంధిత బ్రాంచ్ మేనేజర్, రీజినల్ మేనేజర్లను కూడా బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ సంస్థలు తమ నిధులను ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంచేటప్పుడు ఆయా బ్యాంకుల క్యాపిటల్ అడక్వసీ రేషియో, గత ట్రాక్ రికార్డును కచ్చితంగా పరిశీలించేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలి.
ఇదీ చదవండి: సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!


