రత్నాభరణాల ఎగుమతులు సానుకూలమే | Gems and jewellery exports rise by 6. 5 pc to 2. 9 bn in September | Sakshi
Sakshi News home page

రత్నాభరణాల ఎగుమతులు సానుకూలమే

Oct 15 2025 12:28 AM | Updated on Oct 15 2025 12:28 AM

Gems and jewellery exports rise by 6. 5 pc to 2. 9 bn in September

కలిసొచ్చిన పండుగల డిమాండ్‌ 

సెప్టెంబర్‌ నెలలో 25,737 కోట్లు 

ఆరు నెలల్లో 3 శాతం వృద్ధి  

అమెరికాకు 40 శాతం డౌన్‌

ముంబై: అమెరికా నుంచి టారిఫ్‌ పరమైన సవాళ్లు నెలకొన్నప్పటికీ, పండగలు, వివాహ సీజన్‌ డిమాండ్‌ కలసిరావడంతో సెప్టెంబర్‌లో రత్నాభరణాల పరిశ్రమ మంచి పనితీరు సాధించింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.55 శాతం అధికంగా 2,914 మిలియన్‌ డాలర్ల (రూ.25,737 కోట్లు) మేర ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులు రూ.22,925 కోట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3.66 శాతం పెరిగి 14.09 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 13.60 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరిగాయి. 50 శాతం ప్రతీకార సుంకాల ఫలితంగా అమెరికాకు మాత్రం ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఆరు నెలల కాలంలో యూఎస్‌కు ఎగుమతులు 40 శాతం క్షీణించి 2,770 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. కట్‌ చేసిన, సానబెట్టిన వజ్రాల ఎగుమతులు అయితే 54 శాతం తగ్గి 1,175 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. భారత రత్నాభరణాల ఎగుమతులకు అమెరికా చాలా కాలం నుంచి కీలక మార్కెట్‌గా ఉండగా, ప్రతీకార సుంకాలతో ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. 

బలమైన డిమాండ్‌ కొనసాగుతుంది.. 
ఏప్రిల్‌–సెప్టెంబర్ మధ్యకాలంలో కట్, పాలిష్డ్‌ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 6 శాతం మేర పెరిగి 1,368 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. బంగారం ఆభరణాల ఎగుమతులు 2.4 శాతం పెరిగి 1,092 మిలియన్‌ డాలర్లకు చేరాయి. ‘‘2025–26 మొదటి అర్ధభాగంలో పరిశ్రమ కోలుకుందన్న దానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలక మార్కెట్లు యూఏఈ, హాంగ్‌కాంగ్, యూకేలో రత్నాభరణాల ఉత్పత్తులకు డిమాండ్‌ బలపడింది. ఈ మార్కెట్లకు ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయి. రానున్న వివాహాల సీజన్‌ సమయంలో ప్రవాస భారతీయులు ఉన్న చోట డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.

కనుక ఈ వృద్ధి మరో త్రైమాసికం పాటు స్థిరంగా కొనసాగుతుంది’’అని జీజేఈపీసీ చైర్మన్‌ కిరీట్‌ భన్సాలీ తెలిపారు. అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేసే తయారీదారులు సమస్యలను ఎదుర్కొంటున్నందున ప్రభుత్వంతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగం స్థిరత్వం కోసం ఉపశమన చర్యలను ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రభావిత కార్మికుల కుటుంబాలకు రాయితీపై రుణాలు, వ్యక్తిగత రుణాల పునరుద్ధరణ, ఒక్కో కుమార్తెకు రూ.1,000 చొప్పున విద్యా సాయం, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద కార్మికులను తాత్కాలికంగా చేర్చాలని కోరినట్టు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement