కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడుతాయా? | Future of Work Why AI Is Co-Pilot Not a Threat | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడుతాయా?

May 22 2026 9:44 AM | Updated on May 22 2026 9:51 AM

Future of Work Why AI Is Co-Pilot Not a Threat

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని పుణ్యమా అని భవిష్యత్తులో ఐటీ సహా పలు రంగాల్లో భారీగా ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. సిలికాన్ వ్యాలీలోని గ్లీన్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, భారతీయ సంతతికి చెందిన అరవింద్ జైన్ భిన్నమైన, అత్యంత సానుకూల దృక్పథాన్ని వినిపించారు. ఏఐ ఎప్పటికీ మానవ సిబ్బందిని భర్తీ చేయలేదని, బదులుగా వారి పనితీరును, సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ-ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ గ్లీన్ సీఈఓ అయిన అరవింద్ జైన్.. ‘ఫార్చ్యూన్’ నిర్వహించిన వర్క్‌ప్లేస్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భర్తీ చేసేంత లేదు..

ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఏ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయవచ్చనే చర్చ విస్తృతంగా సాగుతోందని, అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని అరవింద్ జైన్ పేర్కొన్నారు. ‘నా ఉద్దేశం ప్రకారం.. భవిష్యత్తులో ఎప్పటికీ ఏఐ ఏ మానవ సిబ్బందినీ భర్తీ చేయదు. ఇది వాస్తవానికి మనల్ని మరింత సమర్థులుగా మారుస్తుంది. అత్యున్నత నాణ్యతతో కూడిన పనులు చేయడానికి వీలు కల్పిస్తుంది. మేము ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. ప్రస్తుతానికైతే సాంకేతికత కారణంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు’ అని అరవింద్ జైన్ తెలిపారు.

ఉద్యోగులకు ఏఐ ఒక కో-పైలట్‌లాగా పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. రోజువారీగా సాగే రొటీన్, పునరావృత పనులను ఏఐకి అప్పగించడం ద్వారా.. మానవులు తమ ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సమస్యల పరిష్కారం వంటి కీలకమైన అంశాలపై మరింత దృష్టి పెట్టవచ్చని ఆయన విశ్లేషించారు.

దిగ్గజాల హెచ్చరికలు

భవిష్యత్ శ్రామిక శక్తిపై అరవింద్ జైన్ వ్యక్తంచేసిన అంచనాలు, ప్రస్తుత అంతర్జాతీయ వ్యాపార వర్గాల సెంటిమెంట్‌కు పూర్తిగా విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఇప్పటికే ఏఐ ముప్పుపై హెచ్చరిస్తున్నారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఏఐ కారణంగా దాదాపు సగం వరకు వైట్-కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని పదేపదే హెచ్చరించారు. జేపీ మోర్గాన్ అధినేత జేమీ డిమోన్, ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లీ.. అమెరికా సహా అంతర్జాతీయంగా వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ ఆక్రమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు!

Advertisement
 
Advertisement
Advertisement