రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు! | Arvind Panagariya Urges Reserve Bank Of India To Avoid Panic Over ₹100 Per Dollar Mark, Read Inside | Sakshi
Sakshi News home page

రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు!

May 22 2026 8:46 AM | Updated on May 22 2026 11:40 AM

Currency Fall Could Benefit India Economy Says Arvind Panagariya

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోతోంది. ఈ క్రమంలోనే డాలర్‌కు రూపాయి విలువ ఏకంగా 97 మార్కుకు చేరువ కావడంతో దేశీయ ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 100 మార్కును తాకుతుందనే మానసిక ఒత్తిడి లేదా భయంతో ఆర్‌బీఐ తన విధానపరమైన నిర్ణయాలను తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌(గతంలో ట్విట్టర్)లో ఆయన పోస్ట్ చేశారు.

‘డాలర్ ధర రూ.100 చేరుతుందనే కంగారుతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 99, 101 లాగే 100 కూడా ఒక మామూలు సంఖ్య మాత్రమే. ప్రస్తుతం ఉన్న చమురు సమస్యల నేపథ్యంలో రూపాయి విలువ సహజంగానే తగ్గడానికి అనుమతించడమే దేశానికి మంచిది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

స్వల్పకాలికం.. దీర్ఘకాలికం

చమురు కొరత లేదా ధరల పెరుగుదల సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందనే అంశాన్ని బట్టి ఆర్‌బీఐ వ్యూహం ఉండాలని, అయితే ఏ పరిస్థితిలోనైనా రూపాయిని బలవంతంగా రక్షించే ప్రయత్నం చేయకూడదని పనగారియా స్పష్టం చేశారు. ఆయన విశ్లేషణ ప్రకారం..

సంక్షోభం స్వల్పకాలికమైతే (3 నెలల నుంచి ఏడాది)..

చమురు సంక్షోభం తాత్కాలికమే అయితే ఇప్పుడు రూపాయి క్షీణించినప్పటికీ భవిష్యత్తులో చమురు దిగుమతి బిల్లు తగ్గినప్పుడు అది మళ్లీ పుంజుకుంటుంది. పైగా, రూపాయి విలువ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విదేశీ పెట్టుబడులు భారత మార్కెట్ వైపు వేగంగా తరలివస్తాయి. దీనివల్ల కరెన్సీ విలువ సహజంగానే గణనీయంగా కోలుకుంటుంది.

సంక్షోభం దీర్ఘకాలికమైతే (కొన్నేళ్ల పాటు సాగితే)..

ఒకవేళ ఈ అంతరాయం ఎక్కువ కాలం కొనసాగితే ఆర్‌బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్‌ రిజర్వ్స్‌) ఖర్చు చేసి రూపాయిని రక్షించాలని చూడటం సరైన నిర్ణయం కాదని పనగారియా అన్నారు. ‘ఇలాంటి స్థితిలో రూపాయి పడిపోవడాన్ని అంగీకరించకుండా వేరే ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది నష్టపోవడమే అవుతుంది. రూపాయిని కాపాడుకునే ప్రయత్నంలో నిల్వలు పూర్తిగా అడుగంటిపోయేలా చేస్తే భవిష్యత్తులో మరింత నష్టపోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.

‘బ్యాండ్-ఎయిడ్’ పరిష్కారాలు వద్దు..

రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి గతంలో ఉపయోగించిన డాలర్ డినామినేటెడ్ బాండ్లు లేదా ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) డిపాజిట్లపై అధిక వడ్డీ ఇవ్వడం వంటి చర్యలను పనగారియా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి కేవలం తాత్కాలిక ‘బ్యాండ్ ఎయిడ్’ పరిష్కారాలు మాత్రమేనని కొట్టిపారేశారు. ఇవి అత్యంత ఖరీదైన సాధనాలని, వీటి వల్ల వచ్చే లాభాలు కేవలం సంపన్న విదేశీ భారతీయులకే బదిలీ అవుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతుందని విమర్శించారు. ఎప్పటికైనా రూపాయి విలువ రూ.100 మార్కు దాటక తప్పదని, దానికి ఇప్పుడే సిద్ధం కావాలని సూచించారు.

ఇది 2013 నాటి సంక్షోభం కాదు!

దేశం తీవ్ర స్థూల ఆర్థిక ఒత్తిడిని, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొన్న 2013 నాటి పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితిని పోల్చలేమని పనగారియా స్పష్టం చేశారు. అప్పట్లో దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో (10% పైగా) ఆందోళనకరంగా ఉంది. ఆర్‌బీఐ తీసుకున్న వివేకవంతమైన ద్రవ్య విధానాల వల్ల ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. అందువల్ల, కరెన్సీ విలువ తరుగుదల (డిప్రిసీయేషన్‌) కారణంగా వచ్చే స్వల్ప ద్రవ్యోల్బణ ఒత్తిడిని లేదా షాక్‌ను తట్టుకునే బలమైన స్థితిలో ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి: ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు!

Advertisement
 
Advertisement
Advertisement