జీడీపీ, ఆర్‌బీఐ పాలసీపై ఫోకస్‌  | Focus on GDP and RBI policy, says Market Experts | Sakshi
Sakshi News home page

జీడీపీ, ఆర్‌బీఐ పాలసీపై ఫోకస్‌ 

Jun 1 2026 12:59 AM | Updated on Jun 1 2026 12:59 AM

Focus on GDP and RBI policy, says Market Experts

పశ్చిమాసియా పరిస్థితులు కీలకం 

చమురు ధరలు, రూపాయికీ ప్రాధాన్యత 

ఐఐపీ, పీఎంఐ ఇండెక్సులపైనా కన్ను 

ఈ వారం మార్కెట్లపై అంచనాలు

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ఓవైపు యూఎస్, ఇరాన్‌ మధ్య చర్చలు ప్రభావం చూపనుండగా.. మరోపక్క ఆర్‌బీఐ పరపతి సమీక్ష, క్యూ4 జీడీపీ గణాంకాలూ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. 

పశ్చిమాసియా సంక్షోభంపై రోజుకో రకంగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో యూఎస్, ఇరాన్‌ మధ్య చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలకు రెక్కలురావడంతో పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రధానంగా భారత్‌ చమురు వినియోగంలో 80 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడటంతో రూపాయి బలహీనపడుతోంది. 

దిగుమతుల బిల్లులో పసిడి, చమురు ప్రధా న పాత్ర పోషిస్తుండటం దీనికి కారణంకాగా.. వాణిజ్య లోటు పెరుగుతోంది. వెరసి పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం భారత్‌కు సానుకూల అంశమని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్, ఇరాన్‌ చర్చలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా, ఎన్‌రిచ్‌ మనీ సీఈవో పొన్మూడి ఆర్‌. పేర్కొన్నారు.  

గణాంకాల విడుదల 
నేడు(సోమవారం) ఏప్రిల్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలకానున్నాయి. 2026 మార్చిలో ఐఐపీ 4.1 శాతం ఎగసింది. ఫిబ్రవరిలో సవరించిన 5.1 శాతం గణాంకాలతో పోలిస్తే కొంతమేర వెనకడుగు వేసింది. అంతేకాకుండా మే నెలకు హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సరీ్వసెస్, కాంపోజిట్‌ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌లో దాదాపు నాలుగేళ్లలోనే తక్కువస్థాయి తయారీ పీఎంఐ 54.3కు మందగించింది. వీటితోపాటు మే నెలకు ఆటో రంగ(వాహన విక్రయ) గణాంకాలు సైతం వెలువడనున్నాయి. 2025–26 క్యూ4, పూర్తి ఏడాది జీడీపీ గణాంకాలు  జూన్‌ 5న విడుదల కానున్నాయి.

వడ్డీ రేట్లు యథాతథం! 
వారాంతాన(జూన్‌ 5న) ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం వెలువడుతుంది. క్రూడ్‌ సెగతో ధరలకు రెక్కలొస్తున్న విషయం విదితమే. దీంతో టోకుతోపాటు, రిటైల్‌ ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. దీంతో కఠిన విధానాలవైపు ఆర్‌బీఐ మొగ్గు చూపే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం రిసు్కలున్నప్పటికీ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చే వ్యూహంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును మరోసారి 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే వీలున్నట్లు పేర్కొంటున్నారు. గత రెండు పాలసీ సమీక్షలలో ఆర్‌బీఐ రెపో రేటులో స్టేటస్‌ కో అమలు చేసిన సంగతి తెలిసిందే. లిక్విడిటీ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ స్పందన సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలియజేశారు. ఆర్‌బీఐ పాలసీ, జీడీపీ, ఐఐపీ, ఆటో రంగ గణాంకాలు సమీప భవిష్యత్‌లో మార్కెట్ల నడకను ప్రభావితం చేయన్నుట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ వివరించారు,  

ఎఫ్‌పీఐల షాక్‌ 
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మే నెలలోనూ రూ. 33,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఎన్‌ఎస్‌డీఎల్‌ గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి ఇప్పటివరకూ రూ. 2.25 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. తద్వారా మొత్తం 2025 ఏడాదిలో చేపట్టిన రూ. 1.66 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను మించిపోవడం గమనార్హం!!  ఇతర దేశ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండటం, రూపాయి బలహీనత తదితర అంశాలు దీనికి కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మినహా ఈ ఏడాది మిగిలిన నాలుగు నెలల్లోనూ ఎఫ్‌పీఐలు విక్రయాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు.

సాంకేతికంగా చూస్తే.. 
గత వారం ప్రధాన ఇండెక్సులు తొలుత బలపడినప్పటికీ ఎగువ స్థాయిలవద్ద నిలదొక్కుకోలేకపోయాయి. వారాంతాన ఉన్నట్టుండి పెరిగిన భారీ అమ్మకాలతో బలహీనపడ్డాయి. సాంకేతికంగా చూస్తే నిఫ్టీ 23,000 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఆపై అమ్మకాలు కొనసాగితే సమీప భవిష్యత్‌లో 22,400 వరకూ పతనమయ్యే చాన్సుంది. ఈస్థాయిల వద్ద బలమైన సపోర్ట్‌కు వీలుంది.   

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement