టెక్నాలజీతో అకౌంటింగ్‌ వ్యవస్థల్లో పారదర్శకత | Sakshi
Sakshi News home page

టెక్నాలజీతో అకౌంటింగ్‌ వ్యవస్థల్లో పారదర్శకత

Published Sat, Nov 19 2022 6:23 AM

FM Nirmala Sitharaman At Global Gathering Of Accountants - Sakshi

ముంబై: పారదర్శకమైన అకౌంటింగ్‌ వ్యవస్థల కోసం టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం అవసరమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. శుక్రవారం మొదలైన 21వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ సదస్సును ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ (ఐఎఫ్‌సీఏ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఆర్థిక సుస్థిరతకు, ప్రజలకు స్థిరమైన ఉపాధి, స్థిరమైన తయారీ, సేవలకు సైతం పారదర్శక అకౌంటింగ్‌ వ్యవస్థ అవసరాన్ని మంత్రి గుర్తు చేశారు. విశ్వాసం, నైతిక పరమైన  అకౌంటింగ్‌ విధానాలు లేకుండా పారదర్శకత సాధ్యపడదన్నారు.  వెబ్‌ 3.0 వంటి వినూన్న టెక్నాలజీలు ఇప్పటికే మన జీవితంలో భాగమయ్యాయంటూ, వ్యాపార నిర్వహణ విధానాన్ని సైతం ఎంతో మార్చేయగలవన్నారు.

బ్లాక్‌చైన్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలైటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అన్నవి అకౌంటింగ్‌ విధానాలను మెరుగుపరచడమే కాకుండా.. టెక్నాలజీ, మెషిన్‌ ఆధారిత వేగవంతమైన నిర్ణయాలకు వీలు కల్పిస్తాయని చెప్పారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో మరింత పారదర్శకత అవసరాన్ని ప్రస్తావించారు. దీనికి మూలస్తంభం పారదర్శకమైన అకౌంటింగ్‌ అని గుర్తు చేశారు. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దీన్ని నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారు.   

రెన్యువబుల్‌ ఎనర్జీపై పెట్టుబడులు పెంచాలి
పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్‌ టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ డిమాండ్‌ చేశారు. భారత్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం ఏఐఐబీ ప్రెసిడెంట్‌ జిన్‌ లికున్‌ మంత్రి సీతారామన్‌ను ఢిల్లీలో కలుసుకున్నారు. బ్యాంకుకు సంబంధించి పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.

భారత్‌లో ఏఐఐబీ పోర్ట్‌ఫోలియో విస్తరణ (మరిన్ని రుణాల మంజూరు)ను అభినందిస్తూ.. భారత్‌లో పెట్టుబడులు పెంచాలని ఆర్థిక మంత్రి సీతారామన్‌ కోరినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల సంప్రదింపులకు వీలుంటుందని మంత్రి సూచించినట్టు తెలిపింది. ఏఐఐబీలో భారత్‌ 7.74 శాతం వాటాతో రెండో అతిపెద్ద ఓటింగ్‌ హక్కుదారుగా ఉంది. చైనాకు 29.9 శాతం వాటా ఉంది. ఏఐఐబీ బీజింగ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement