విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫైనల్‌లో మరోసారి తన స్థిరమైన ఆటతీరుతో అద్భుత ప్రదర్శన చేశారు. 42 బంతుల్లో 75 పరుగులు (నాటౌట్) చేసి ఆర్‌సీబీ విజయానికి కీలక పాత్ర పోషించారు. అతని ఆట శైలి కేవలం భారీ షాట్లపై కాకుండా, సరైన టెక్నిక్, సహనం, క్రమశిక్షణపై ఆధారపడుతుందని అతని కోచ్ వ్యాఖ్యానించారు. కోహ్లీ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. ఆయన కెరీర్ క్రీడల్లో మాత్రమే కాకుండా.. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా విలువైన పాఠాలు నేర్పుతుంది. ఈ కథనంలో ఆ విషయాలను వివరంగా తెలుసుకుందాం.
➤ఒకటి.. కోహ్లీ విజయానికి కారణం అతని స్థిరత్వం, క్రమశిక్షణ. ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ కాదు, సంవత్సరాల తరబడి నిరంతర ప్రదర్శనే అతన్ని గొప్ప ఆటగాడిగా నిలబెట్టింది. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ఒకేసారి పెద్ద లాభాలు ఆశించడం కంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (SIP) వంటి విధానంతో నిరంతరంగా పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాన్ని ఇస్తుంది.
➤రెండవది, తక్కువ వయస్సులోనే ప్రారంభించడం. కోహ్లీ 19 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్‌లో ప్రవేశించారు. ఇది అతనికి అనుభవం, తప్పిదాల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించింది. పెట్టుబడుల్లో కూడా ముందుగా ప్రారంభిస్తే చక్రవడ్డీ ద్వారా ఎక్కువ సంపద సృష్టించుకోవచ్చు.
➤మూడవది, డైవర్సిఫికేషన్ (పెట్టుబడుల విభజన). కోహ్లీ కేవలం ఒక రంగంలోనే కాకుండా స్పోర్ట్స్, టెక్, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా షేర్లు, బాండ్లు, బంగారం వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలి.
➤నాలుగవది, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం. క్రికెట్‌లో ఒత్తిడి పరిస్థితుల్లో కూడా కోహ్లీ స్థిరంగా ఆడతాడు. అలాగే మార్కెట్ పతనాలు వచ్చినప్పుడు భయపడకుండా దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.
➤చివరగా.. వయస్సు, అవసరాల ప్రకారం వ్యూహం మార్చుకోవడం. కోహ్లీ ఇప్పుడు కొన్ని ఫార్మాట్లకు మాత్రమే ఆడుతున్నాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా రిటైర్మెంట్ దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించి సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.
Note: పెట్టుబడుల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన!


