దుబాయ్ అంటే అందరికీ 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనంగా ప్రసిద్ధి చెందిన ఈ బుర్జ్ ఖలీఫాను ఒక మత్స్యకారుడి కుమారుడు నిర్మించారనే విషయం బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.
బుర్జ్ ఖలీఫాను.. దుబాయ్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించింది. ఈ కంపెనీ ఫౌండర్ 'మహమ్మద్ అలబ్బర్' (Mohamed Alabbar). ఈయనే బుర్జ్ ఖలీఫా యజమాని.

తండ్రి మత్స్యకారుడు
మహమ్మద్ అలబ్బర్.. దుబాయ్‌లో ఒక సాధారణ, మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఒక మత్స్యకారుడు. చిన్నప్పుడు తన తండ్రి చేసే పనిలో సహాయం చేసేవాడు. పట్టుదల, క్రమశిక్షణ, వినయాన్ని నా తండ్రి నుంచే నేర్చుకున్నానని అలబ్బర్ అనేక ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.
ప్రాధమిక విద్యను దుబాయ్‌లో పూర్తిచేసిన మహమ్మద్ అలబ్బర్.. ఆ తరువాత ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్ ద్వారా అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత 1981లో స్వదేశానికి (దుబాయ్) తిరిగి వచ్చాడు. అలబ్బర్ అమెరికా నుంచి కేవలం డిగ్రీతో రాలేదు. జీవితంలో ఎదగడానికి ఎదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వచ్చాడు.

బ్యాంక్‌లో ఉద్యోగం
అలబ్బర్ తన కెరియర్‌ను యుఎఈ సెంట్రల్ బ్యాంక్‌లో ప్రారంభించి, ఆర్థిక వ్యవస్థల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. పనితనంతో అందరి దృష్టినీ ఆకసారిస్తూ.. చాలా తక్కువ కాలంలోనే ఆయన దుబాయ్ ఆర్థిక అభివృద్ధి విభాగానికి డైరెక్టర్ జనరల్ అయ్యారు. ఆ సమయంలోనే దుబాయ్ దార్శనిక పాలకుడు 'షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్'తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాతే భవిష్యత్తును ఊహించాడు.
1997లో అలబ్బర్ ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను స్థాపించినప్పుడు. ఆ సమయంలో చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఒక దశాబ్దంలోనే దీనికి ఎనలేని గుర్తింపు లభించింది. ఆ తరువాత దుబాయ్ ఫౌంటెన్, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మాల్ వంటి నిర్మాణాలను పూర్తిచేసి.. ఈ రంగంలో అలబ్బర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు.

బుర్జ్ ఖలీఫా గురించి
ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా.. అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ భవనాల్లో కూడా ఒకటి. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ అద్దె ఏడాదికి 180000 – 250000 దిర్హామ్‌లు (రూ. 40 లక్షల నుంచి రూ. 55 లక్షలు).
బుర్జ్ ఖలీఫా ఎత్తు 829.8 మీటర్లు (2,722 అడుగులు). ఇందులో 163 అంతస్తులు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణం 2010కి పూర్తయింది. 95 కిలోమీటర్ల నుంచి కూడా కనిపించే ఈ భవనంలో 304 విలాసవంతమైన హోటల్ రూల్స్, 900 హై-ఎండ్ అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్డింగ్ బయటివైపు శుభ్రం చేయడానికే సుమారు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం.
ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందన్న భయం: రోజుకు రెండు గంటలే నిద్ర!


