
ఉద్యోగులు, ఆదాయ పరిమితులు మించినవారు చాలా మంది ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాలని భావిస్తారు. అయితే ఆ ఐటీఆర్‌లను ఫైల్ చేసేందుకు అవసరమైన ధ్రువపత్రాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఇటీవల జులై 31 వరకు ఉండే ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీని ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. కాబట్టి ముందుగా కింది ధ్రువపత్రాలను సిద్ధం చేసుకొని, వీలైనంత త్వరగా ఐటీఆర్ దాఖలు చేయాలి.
ఫారమ్–16
వేతనంతోపాటు, టీడీఎస్ వివరాలు ఇందులో ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారిపోతే, పాత–కొత్త యాజమాన్యాల నుంచి ఫారమ్–16ను తప్పకుండా తీసుకోవాలి. ఇందులో పార్ట్–ఏ కింద టీడీఎస్ మినహాయిస్తే ఆ వివరాలు నమోదవుతాయి. పార్ట్–బీ కింద జీతభత్యాలు, మినహాయింపుల క్లెయిమ్ వివరాలు ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్, బీమా కంపెనీ నుంచి కమీషన్‌కు సంబంధించి వివరాల కోసం ‘ఫారమ్–16ఏ’ని తీసుకోవాలి.
ప్రాపర్టీ లావాదేవీ విలువ (రిజిస్టర్డ్) రూ.50 లక్షలకు మించినప్పుడు టీడీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ‘ఫారమ్–16బీ’ని కొనుగోలుదారుడు విక్రయదారుడికి జారీ చేస్తారు. నెలవారీ ఇంటి అద్దె రూ.50,000 మించితే, అప్పుడు సైతం టీడీఎస్ అమలు చేయాలి. కిరాయిదారుడు ఇంటి యజమానికి ‘ఫారమ్–16సీ’ని అందిస్తారు. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఈ వివరాలు ముందుగానే నింపి ఉండడం గమనించొచ్చు. వాటిని సరిపోల్చుకుని, అవసరమైతే అదనపు వివరాలు నమోదు చేసి సమర్పించాల్సి ఉంటుంది.
మూలధన లాభాల రిపోర్ట్
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను విక్రయించినప్పుడు స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు వస్తుంటాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నివేదికను బ్రోకర్ల నుంచి, ఫండ్స్ సంస్థల నుంచి తీసుకోవాలి. ఇందులోని వివరాలను ఐటీఆర్‌లో నమోదు చేయడం తప్పనిసరి. క్లియర్ ట్యాక్స్ తదితర సంస్థల ద్వారా రిటర్నులు వేసేట్టు అయితే క్యాపిటల్ గెయిన్స్ రిపోర్ట్‌ను అప్‌లోడ్ చేస్తే ఐటీఆర్ పత్రంలో ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా భర్తీ అవుతాయి.
ఏఐఎస్/ఫారమ్–26ఏఎస్
‘ఫారమ్–26ఏఎస్’లో టీడీఎస్, టీసీఎస్ వివరాలు ఉంటాయి. ఏఐఎస్‌లో అద్దె, డివిడెండ్‌లు, ఆస్తుల అమ్మకాలు ఇలా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ చెల్లింపులు, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, జీఎస్‌టీ టర్నోవర్ వివరాలు ఉంటాయి. ఏఐఎస్‌నే టీఐఎస్ అని కూడా అంటారు. వీటితోపాటు బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, ఆర్థిక సంస్థలు జారీ చేసే ఇంటరెస్ట్ సర్టీఫికెట్‌లు, పన్ను మినహాయింపు పెట్టుబడులు, వ్యయాలకు సంబంధించిన ఆధారాలు (బీమా ప్రీమియం సర్టీఫికెట్, ట్యూషన్ ఫీజులు తదితర) సిద్ధంగా ఉంచుకోవాలి.
ఇదీ చదవండి: ఓలా కృత్రిమ్‌లో రెండో విడత లేఆఫ్స్
కొన్ని ముఖ్యమైన గుర్తింపు పత్రాలు
పాన్ కార్డ్: ఆదాయ, వ్యయాల రికార్డు కోసం.
ఆధార్ కార్డ్: ఈవెరిఫికేషన్ కోసం.
పే స్లిప్పులు: ఆదాయ మార్గాలను క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి.
ఫారం 16ఏ/బీ/సీ/డీ: వడ్డీ, ఆస్తి అమ్మకం, అద్దె లేదా ప్రొఫెషనల్ ఫీజులపై టీడీఎస్ కోసం.
క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్స్: బ్రోకర్లు లేదా మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తీసుకోవాలి.
అద్దె ఆదాయ వివరాలు: మునిసిపల్ పన్ను రశీదులు, రుణ వడ్డీ ధ్రువీకరణ పత్రాలు.
వ్యాపార ఆదాయ రికార్డులు: లాభనష్టాల స్టేట్‌మెంట్‌లు, బ్యాలెన్స్ షీట్లు.
వడ్డీ ధ్రువీకరణ పత్రాలు: పొదుపు ఖాతాలు, ఎఫ్‌డీలు, పోస్టాఫీసు పథకాలు కోసం.
అడ్వాన్స్ ట్యాక్స్/సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రిసిప్ట్స్
పెట్టుబడి రుజువులు
సెక్షన్ 80సీ (ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ట్యూషన్ ఫీజు)
సెక్షన్ 80డీ (ఆరోగ్య బీమా)
సెక్షన్ 80ఈ (ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ)
సెక్షన్ 80జీ (విరాళాలు)