ప్ర. మా దగ్గర ఈక్విటీ షేర్లు ఉన్నాయి. అవన్నీ లిస్టెడ్..లాంగ్ టర్మ్. వాటిని అమ్మితే ఏర్పడ్డ లాభాలను గుర్తింపు పొందిన బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు లభిస్తుందా?
– ఎ.వి. రమణ మూర్తి, విశాఖపట్నం
జ. మూలధన లాభాల నుంచి మినహాయింపు పొందాలంటే సెక్షన్లలో నిర్దేశించిన విధంగా ఇన్వెస్ట్ చేస్తేనే మినహాయింపు ఇస్తారు. ఉదాహరణకు, ఇల్లు, భూమి.. రెండూ.. ఇటువంటివి అమ్మి, షరతులకు లోబడి మళ్లీ ఇళ్లు కొంటే మినహాయింపు ఇస్తారు. ఇలాంటి మినహాయింపు షేర్ల విషయంలో ఒక ఇంటికి తప్ప దేనికి లేదనే చెప్పాలి. బాండ్లకి మినహాయింపు లేదు. ఇల్లు అమ్మి, ఇల్లు కొంటే మినహాయింపు.. అలాగే ల్యాండ్, ఇండస్ట్రియల్ హబ్. కానీ బంగారం అమ్మి బంగారం కొంటే మినహాయింపు లేదు. అలాగే, వెండి, ఆభరణాలు కూడా.
అయితే, మినహాయింపు విషయంలో ఒక్క గుర్తింపు పొందిన బాండ్లకు మాత్రం అవకాశం ఉంటుంది. అవేమిటంటే, నేషనల్ హైవే, రూరల్ ఎలక్ట్రిఫికేషన్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ బాండ్లు. ఇళ్లు మళ్లీ కొనుక్కోకపోయినా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే మినహాయింపు దొరుకుతుంది. ఇదొక మంచి అవకాశం. ఇక షేర్స్ విషయానికొస్తే..
అవి లిస్టెడ్ షేర్లు అయి ఉండాలి.
లాంగ్ టర్మ్ అయి.. అంటే ఏడాది దాటి ఉండాలి ఇటువంటివి అమ్మితే ఏర్పడ్డ లాభాలకు సంబంధించి విషయాలను తెలుసుకుందాం.
అలా ఏర్పడ్డ లాభాల మీద మొదటి రూ. 1,25,000లకు మినహాయింపు, బేసిక్‌గా దొరుకుతుంది. జీతంలో స్టాండర్డ్ డిడక్షన్‌లాగా.
మిగతా లాభం మీద 12.5 శాతం పన్ను విధిస్తారు.
మీ ఆలోచన లిస్టెడ్ షేర్ల మీదే ఉండాలి. హోల్డింగ్ పీరియడ్ ఏడాది దాటాలి.
ఇక మీ చేతిలో ఉన్న మొత్తం మీ ఇష్టం. బంగారమే కొంటారో. వెండి కొంటారో .. పిల్ల పెళ్లో.. అబ్బాయి చదువో.. ల్యాండో.
ఎలాగూ అమ్మే ముందు లాభం తెలుస్తుంది, కాబట్టి ఆ లాభం సుమారుగా రూ. 1,12,500 లోపల ఉంటుంది. కాబట్టి ఎటువంటి పన్ను భారం ఉండదు.
ట్రెండింగ్‌లో కొన్న షేర్లు నష్టాలబాటలో ఉంటాయి. వాటిని వదిలించుకోండి. నష్టం ఏర్పడుతుంది. ఆ నష్టాన్ని మిగతా, మూలధన లాభంతో (షేర్ల మీద) సర్దుబాటు చేసుకోవచ్చు. మొత్తం మీద బేసిక్ లిమిట్ దాటకుండా ఉంటే, ఇప్పుడు మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేయండి. పన్ను భారం ఉండదు.
అమ్మగా వచ్చిన మొత్తం, పన్ను చెల్లించి మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేయండి. కొత్త షేర్లు బాగా పెరిగితే, మీకు లాంగ్ రేంజిలో ప్రయోజనం ఉంటుంది. డివిడెండ్లతో పాటు ఆస్తి విలువ పెరిగిపోతుంది.
కొంత మంది త్వరలో పెళ్లి చెద్దామనుకుంటున్నవారు బంగారం, వెండి కొంటున్నారు.
80సీలో ఉన్న ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఉత్తరోత్తరా మినహాయింపు దొరుకుతుంది.
ఒక అవకాశం, ఇల్లు తప్ప ఏ ఆస్తి అమ్మినా, బంగారం, ల్యాండ్, షేర్లు వల్ల ఏర్పడ్డ క్యాపిటవ్ గెయిన్స్‌తో సెక్షన్ 54 ఎఫ్ కింద ఒక ఇల్లు కొనవచ్చు/కట్టుకోవచ్చు. అమ్మకాల విలువలోనుంచి కాస్ట్ తీసివేసి, మిగతా పరిహారం ఇన్వెస్ట్ చేయాలి. చేసినంత మేరకే మినహాయింపు ఇస్తారు. నిర్దేశిత వ్యవధిలోపల కొనాలి/కట్టించాలి. ఆఇంటి మీద ఖర్చు రూ. 10 కోట్లు దాటకూడదు. దాటినా మినహాయంపు రూ. 10 దాటి ఇవ్వరు. షేర్లు అమ్మిన వ్యక్తి పేరు మీదే ఇల్లు కొనాలి.
ముఖ్యంగా ఇల్లు కొనే వేళకు ఆ వ్యక్తి పేరుమీద ఇల్లు ఉండదు. అంటే ఈ రిలీఫ్ ఇల్లు లేని వాళ్లు కొనుక్కోంటేనే వస్తుంది.
చివరిగా చెప్పాలంటే..
లిస్టెడ్ షేర్లు లాంగ్ టెర్మ్‌లో అమ్మితే, బేసిక్ లిమిట్ రూ. 1,25,000 తప్ప ఎలాంటి మినహాయింపు లేదు. మీరు చెప్పిన బాండ్లు కొనడం వల్ల ఎలాంటి మినహాయింపు లేదు. కొంత మంది ట్యాక్స్ హార్వెస్టింగ్ అని అంటున్నారు. అది ప్లానింగ్‌లో భాగం మాత్రమే. వృత్తి నిపుణులను సంప్రదించండి.
మామూలుగా బేసిక్ లిమిట్ రూ. 3,00,000 లేదా రూ. 4,00,000 .. ప్లానింగ్ పేరున మీ ఆదాయాన్ని బేసిక్ లిమిట్‌కి తీసుకురాగలమా.. అది కుదరని పని. దాని కన్నా కేవలం ఆర్థికంగా లాభనష్టాలు అంచనా వేసి, చట్టప్రకారం మసులుకోవడమే మంచి పని.


